పలుచోట్ల స్వల్ప ఘర్షణలు
● దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు
మహబూబాబాద్ అర్బన్/మహబూబాబాద్ రూరల్/ మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జమాండ్లపల్లి రెండోవార్డు ప్రభుత్వ జెడ్పీహెచ్‌ఎస్ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు వారిని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు నాయకులందరినీ అక్కడి నుంచి పంపించారు.
● జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్న 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గాడిపెల్లి నాగేశ్వర్‌రావు, నాయకులను బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బత్తుల కృష్ణ, నాయకులు నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని.. గొడవ పెద్దది కావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
● జిల్లా కేంద్రంలోని 30వ వార్డు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. సీపీఎం, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు దొంగ ఓట్లు వేపిస్తున్నారని ఆరోపించారు. గొడవ పెద్దది కావడంతో అడ్మిన్ డీఎస్పీ మోహన్‌రావు, టౌన్ ఎస్సై ప్రశాంత్ సిబ్బందితో సంఘటన స్థలికి చేరుకొని నాయకులను చెదరగొట్టారు. దొంగ ఓటు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తామని డీఎస్పీ మోహన్‌రావు తెలిపారు.
● తొమ్మిదో వారు పరిధి శనిగపురం జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటు వేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అడ్మిన్ డీఎస్పీ మోహన్‌రావు, రూరల్ సీఐ సర్వయ్య ఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి సముదాయించారు. కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థి చుక్క వెంకటేష్ మాట్లాడుతూ.. వార్డు పరిధిలోని 17వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఇస్లావత్ రామకు బదులు బీఆర్‌ఎస్ నాయకుడు గుగులోత్ రాజునాయక్ ఓటు హక్కు లేని బానో త్ అఖిల్‌తో దొంగ ఓటు వేయించాడని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో ఉన్న రూరల్ ఎస్సై దీపిక సమక్షంలోనే కానిస్టేబుల్ అశోక్ బానోత్ అఖిల్‌ను వెంట తీసుకెళ్లి దొంగ ఓటు వేయించారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా సహా య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని, అదేవిధంగా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
● మున్సిపాలిటీ పరిధి 33వ వార్డుకు చెందిన పోలింగ్ కేంద్రాన్ని గాంధీపార్కులోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేశారు. ఆ కేంద్రం సమీపంలో బీఎల్‌ఓ పోల్ స్లిప్స్ ఇస్తుండగా ఆమె దగ్గర కొంత మంది కాంగ్రెస్ నాయకులు కూర్చున్నారు. పోల్ స్లిప్స్ ఇస్తున్న క్రమంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని సీపీఐ అభ్యర్థి అజయ్‌సారథిరెడ్డి వారితో వాగ్వాదం చేశారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. వెంకటేశ్వర బజార్‌లోని పోలింగ్ కేందరం ఎదుట దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
పలుచోట్ల స్వల్ప ఘర్షణలు


