హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివచ్చారు. అలాగే మేడారంలోని వనదేవతలను దర్శించుకున్న భక్తులు సైతం పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పవిత్ర చింతామణి జలపాతం వద్ద భక్తుల సందడి నెలకొంది. వందలాది మంది భక్తులు ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రధాన ఆలయానికి క్యూ కట్టారు. దీంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.


