ఆదివాసీల సంస్కృతిని కాపాడడమే లక్ష్యం
హన్మకొండ కల్చరల్: ఆదివాసీల సంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ వారి ఆత్మగౌరవాన్ని దేశనలుమూలలా చాటడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన సమ్మక్క సారక్క మహాజాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన హుండీల్లోని కానుకల లెక్కింపు గురువారం ప్రారంభమైంది. జాతరలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద ఏర్పాటు చేసిన 780 ఇనుపరేకు హుండీలు, 45 వస్త్రహుండీలు, 3 ఓడిబాలబియ్యం హుండీలు కలిపి మొత్తం 828 హుండీలను భారీ సెక్యూరిటీతో ఫిబ్రవరి 2వ తేదీన హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపానికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం మంత్రి కొండా సురేఖ కల్యాణ మండపంలో కానుకల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం దేవాదాయశాఖ సిబ్బంది, సేవా సమితి సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కింపు జరుగుతున్న హాలుతోపాటు, కల్యాణమండపం క్యారిడార్‌ను కవరేజ్ చేసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 6గంటల వరకు మొత్తం 125 హుండీలను లెక్కించగా రూ.2,49,65,000 ఆదాయం సమకూరినట్లు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈఓ ఎం.వీరస్వామి వెల్లడించారు. లభ్యమైన ఆదాయాన్ని యునియన్, కెనరా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో జమచేసినట్లు తెలిపారు. అలాగే వెండి, బంగారం, విదేశీ కరెన్సీలను లెక్కించాల్సి ఉందని తెలిపారు. డీసీఎస్ హైదరాబాద్ కృష్ణప్రసాద్, వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ రామల సునీత పర్యవేక్షించారు.
రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ
మంత్రి కొండా సురేఖ
మేడారం మహాజాతర
హుండీల లెక్కింపు ప్రారంభం
మొదటి రోజు లెక్కించిన హుండీలు 125
ఆదాయం రూ.2,49,65,000
ఆదివాసీల సంస్కృతిని కాపాడడమే లక్ష్యం


