న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీనియర్ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి.రఘునాథ్ అన్నారు. జనవరి 30న జరగనున్న తెలంగాణ అడ్వకేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానుకోట బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో బార్ కౌన్సిల్ రెండు సంవత్సరాలకు ఎన్నుకుంటే ఎనిమిది సంవత్సరాలకు పొడిగించుకుని కాలయాపన చేసిందని, న్యాయవాదులకు సరైన న్యాయం చేయలేదన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం పోరాటం చేస్తానని, యువ న్యాయవాదుల వృత్తి నైపుణ్యాలు, ఆరోగ్య కార్డులు, సంక్షేమం కోసం ప్రయత్నిస్తానని, మౌలిక సదుపాయాల కోసం పాటుపడతానని పేర్కొన్నారు. న్యాయవాదుల గొంతుకగా నిలబడతానని హామీఇస్తూ రాబోయే ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేష్ రెడ్డి, రహీంపటేల్, సంద కృష్ణ, దర్శనం రామకృష్ణ, జీవై.గిరి, సత్యనారాయణ, చిన్నమహేందర్, మున్నా, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


