
బైక్, ఏటీఎం వ్యాన్ ఢీ..
గార్ల: బైక్, ఏటీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మత్స్యకారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం గార్ల మండలం తిర్లాపురం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గార్ల మండల కేంద్రంలోని బెస్తబజారుకు చెందిన బాదం సురేందర్(48) మత్స్య కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బైక్‌పై ఖమ్మం వెళ్లి చేపల వలలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో తిర్లాపురం గ్రామ సమీపంలో గార్ల నుంచి డోర్నకల్ వెళ్తున్న ఏటీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొనడంతో సురేందర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవీందర్ తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మత్స్య కార్మికుడు సురేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకార్మిక సంఘం గార్ల మండల అధ్యక్షుడు బాదం కుమారస్వామి డిమాండ్ చేశారు.
మత్స్యకారుడి దుర్మరణం
తిర్లాపురం సమీపంలో ఘటన