అబద్ధాలు మాట్లాడడంలో కేసీఆర్ దిట్ట
హన్మకొండ : అబద్ధాలు మాట్లాడడంలో కేసీఆర్ దిట్ట అని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు ఎద్దేవా చేశారు. సోమవారం హనుమకొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు మాట్లాడడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ పడుతున్నారని దుయ్యబట్టారు. ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని, దేశ సరిహద్దులో పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంటే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడరని, ఇప్పుడు ఆపరేషన్ కగార్‌పై స్పందించడం హాస్యాస్పదమని విమర్శించారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ స్థాపించి 25 ఏళ్లు అయ్యిందా, బీఆర్‌ఎస్ స్థాపించి 25 ఏళ్లు అయ్యిందా అని రజతోత్సవ సభ నిర్వహించారని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎంఐఎం అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచేందుకు పోటీ నుంచి తప్పుకున్న మీరు ముస్లింలకు మద్దతు ఇస్తున్నావా.. హిందువులకు మద్దతు ఇస్తున్నావా అని ప్రశ్నించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదని కేసీఆర్ మాట్లాడడం సిగ్గు చేటని విమర్శించారు.మహాలక్ష్మి స్వరూపులైనా ఆడపిల్లలను ఆడపోరీలు అని అవమాన పరిచిన కేసీఆర్ మహిళలకు బహిరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లభ వెంకటేశ్వర్లు, నాయకుడు పగడాల కాళిప్రసాద్ పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది
బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు


