మిర్చి ధర తగ్గించారంటూ రైతుల ఆందోళన
● కేసముద్రం మార్కెట్‌లో ఘటన
కేసముద్రం: కొందరు వ్యాపారులు కుమ్మకై ్క మిర్చి ధరను అమాంతం తగ్గించి, తమను మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహించిన సంఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో జరిగింది. మార్కెట్‌కు మంగళవారం సుమారు 700 మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఈ మేరకు వ్యాపారులు టెండర్లు వేయగా, పలువురు రైతులు తీసుకువచ్చిన మిర్చికి క్వింటాకు రూ.6 వేల వరకే ధర పడింది. దీంతో రైతులంతా ఆగ్రహానికి లోనై నిన్నటి వరకు మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.12వేల వరకు ఉండగా, ఇప్పుడు సగానికి సగం ధరను ఎలా తగ్గిస్తారంటూ ఆందోళనకు దిగారు. ధరతోపాటు, తూకంలో మోసం చేస్తున్నారని, క్యాష్ కటింగ్ పేరుతో తమను దోచుకుంటున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తమ మిర్చికి టెండర్లు వేయాలంటూ వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సెకండ్ ఎస్సై కరుణాకర్ పోలీస్‌సిబ్బందితో మార్కెట్ యార్డుకు చేరుకుని, రైతులతో మాట్లాడారు. ధర పడని బస్తాలకు తిరిగి బుధవారం టెండర్లు వేయిస్తామని రైతులను శాంతింపజేశారు.


