ఆదివాసీలపై పెరిగిన దాడులు | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలపై పెరిగిన దాడులు

Apr 21 2025 8:11 AM | Updated on Apr 21 2025 8:17 AM

హన్మకొండ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీలపై దాడులు, లైంగికదాడులు పెరిగాయని ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్‌ పెరుమాళ్‌ అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఆదివాసీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బునియాదీ కార్యకర్త సమ్మేళన్‌’ రెండో రోజు శిక్షణ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వనాథన్‌ పెరుమాళ్‌ మాట్లాడుతూ ఆదివాసులను వనవాసులుగా మార్చి తరతరాలుగా భూమి మీద ఉన్న హక్కులను తొలగించాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆదివాసీ సంస్కృతిని కలుషితం చేయడం కోసం మనువాద సంస్కృతిని రుద్దుతున్నారని ఆరోపించారు. ఆదివాసీల్లో నాయకత్వాన్ని పెంపొందించడానికి ఆదివాసీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ట్రైనింగ్‌ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఆదివాసులు ఆత్మగౌరవంతో బతుకడానికి కారణం కాంగ్రెస్‌ తీసుకొచ్చిన రాజ్యాంగమేనన్నారు. ఈ రాజ్యాంగం లేకుండా చేసే కుట్రలను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నాయన్నారు. ‘తెలంగాణలో ఆదివాసీ ఉద్యమాలు– ప్రత్యేక రాష్ట్రంలో ఆదివాసుల పాత్ర’ అనే అంశంపై తెలంగాణ ఉద్య మ నాయకుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, ‘భారత రాజ్యాంగం –ఆదివాసీ సంస్కృతి’ అనే అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ రవి, ‘భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం, ఆదివాసుల పాత్ర’ అనే అంశంపై కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ప్రొఫెసర్‌ వెంకటనారాయణ, ‘భారత రాజ్యాంగం – ఆదివాసీ ఉద్యమాలు’ అనే అంశంపై తెలంగాణ ఉద్యమకారుడు ఇన్నయ్య, ‘భారత రాజ్యాంగం – కాంగ్రెస్‌ పార్టీ – ఆదివాసీల నాయకత్వం’ అనే అంశంపై ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, ‘ఆదివాసీలు– కాంగ్రెస్‌ విధానాలు’ అనే అంశంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, ‘ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ– కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు’ అనే అంశంపై డాక్టర్‌ రియాజ్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌, నాయకులు రాహుల్‌ బాల్‌, ఎమ్మెల్యే కె.ఆర్‌.నాగరాజు, నాయకులు గుగులోత్‌ రవీందర్‌ నాయక్‌, రవళి, వినోద్‌ లోక్‌ నాయక్‌, తిరుపతి నాయక్‌, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.

ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌ పెరుమాళ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement