
డిగ్రీ పరీక్షల వాయిదా తప్పదా?
పరీక్ష ఫీజుచెల్లించిన కళాశాలలు 156 మాత్రమే
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బి ఓకేషనల్, బీసీఏ, తదితర కోర్సుల 2,4,,6 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించాలని, వీటి తర్వాత వెంటనే 1,3,5 సెమిస్టర్ల పరీక్షలు కూడా నిర్వహించాలని అధికారులు టైంటేబుల్ విడుదల చేసి పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యారు. అయితే ఆయా పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సిద్ధంగా లేవు. ప్రభుత్వం మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని, దీంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందుకే పరీక్షలు నిర్వహించబోమని ఆయా యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు ఇప్పటికే యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం వరకు కూడా యూనివర్సిటీ పరిధిలో ఎక్కువ శాతం ప్రైవేట్ కళాశాలలు పరీక్ష ఫీజులు యూనివర్సిటీ పరీక్షల విభాగానికి చెల్లించలేదు. అయితే ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పరీక్షలు సమీపిస్తున్నా హాల్‌టికెట్లు జారీచేయకపోవడంతో విద్యార్థులు అయోమయం చెందుతున్నారు. అన్ని సెమిస్టర్లు కలిపి సుమారు 2లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయాల్సింటుంది
విద్యార్థుల నుంచి వసూలు చేసిన
ఫీజులు నేటికీ వర్సిటీకి చెల్లించని వైనం
కేయూ పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాలు, పలు అటానమస్ కాలేజీలు కలిపి సుమారు 292 డిగ్రీ కళాశాలలున్నాయి. అందులో శుక్రవారం వరకు అన్ని యాజమాన్యాలు కలిపి 156 కళాశాలలు మాత్రమే ఫీజులు పరీక్షల విభాగానికి చెల్లించాయి. ఇటీవల యూనివర్సిటీ అధికారులు ఫీజులు చెల్లించిన విద్యార్థులకే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించినా ఆయా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మాత్రం బేఖాతర్ చేస్తున్నాయి. పరీక్షలను ఫీజురీయింబర్స్‌మెంట్‌కు ముడిపెట్టి విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను పరీక్షల విభాగానికి చెల్లించకపోవడంతో పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీ అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు. ఎందుకంటే ఈనెల 21నుంచే పరీక్షలు నిర్వహించాల్సింటుంది. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచాల్సింటుంది. ఈ ప్రక్రియను చేపట్టే పరిస్థితులు కనపడడం లేదు. అందుకే వాయిదా వైపు మొగ్గుచూపేందుకే అవకాశాలున్నాయి..
ఓయూలో కొనసాగుతున్న
పరీక్షలు.. ఎంజీయూలో వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో కూడా ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు సిద్ధంగా లేకపోవడంతో 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు మాత్రం వాయిదావేశారని సమాచారం. దీంతో కాకతీయ యూనివర్సిటీ కూడా పరీక్షలను వాయిదా వేయక తప్పదని తెలుస్తోంది.
విద్యార్థుల నుంచి వసూలు చేసినా
వర్సిటీకి చెల్లించని ఎక్కువ శాతం
ప్రైవేట్ కళాశాలలు
ఫీజురీయింబర్స్‌మెంట్‌కు,
పరీక్షలకు ముడి
పరీక్షలకు 2లక్షల మందికి పైగా
విద్యార్థుల నిరీక్షణ
నేడు వాయిదా నిర్ణయం వెల్లడించే అవకాశం
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు సిద్ధంగా లేకపోవడం.. పరీక్షల ఫీజులు చెల్లించకపోవడంతో టైంటేబుల్ ప్రకారం పరీక్షలు ఈనెల 21నుంచి నిర్వహించడం సాధ్యం కాదు. ఈనెల 19న వీసీ కె. ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీకి రానున్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో చర్చించి వాయిదా వేసే అవకాశాలున్నాయి.