వడ్డీల దందా..
మంగళవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2024
వడ్డీల దందా..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో గిరిజనులు, ఆదివాసీలు, మధ్య్య తరగతి కుటుంబాలకు చెందినవారు అధికశాతం ఉంటారు. వీరి అవసరాలు వడ్డీ వ్యాపారులకు వరంగా మారింది. వ్యవసాయ పెట్టుబడులు, అమ్మాయిల పెళ్లిళ్లు, వైద్య ఖర్చులకోసం తక్షణం డబ్బులు అవసరమైన వారు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు తీసుకుంటున్నారు. ఈ డబ్బులు ఇచ్చేందుకు సదరు వ్యాపారి వద్ద బంగారం, ప్రామిసరీ నోట్, ఏటీఎం కార్డులు, ఖాళీ చెక్కులు, లేదా భూ పత్రాలు తనఖా పెట్టాల్సి వస్తోంది. ఇన్ని పెట్టుకున్నా.. వందకు నెలకు రూ. 5 నుంచి రూ.10 మేరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు రోజువారి, వారం వారీగా కూడా వడ్డీ వసూలు చేసేవారు ఉన్నారు. ఇలా రోజుకు వెయ్యి రూపాయలకు రూ. 5నుంచి రూ.10 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. దీంతో సదరు వ్యక్తి డబ్బులు చెల్లించే నాటికి అసలు కన్నా వడ్డీ ఎక్కువ కావడంతో అప్పు తీర్చడం కష్టంగా మారుతోంది. ఇలా సామాన్య ప్రజలు మొదలుకొని పలువురు రాజకీయ నాయకులు, ఉద్యోగులు కూడా ఈ అధిక వడ్డీకి డబ్బులు తీసుకున్నవారిలో ఉండడం గమనార్హం. జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు భూ పత్రాలు పెట్టి లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.
జోరుగా గిరిగిరి ..
వడ్డీకి వడ్డీ.. అసలుకు మించి మిత్తి వసూలు చేసే గిరిగిరి వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌తో పాటు పలు మండల కేంద్రాల్లో గిరిగిరి వ్యాపారం ఎక్కువ మొత్తంలో సాగుతోంది. చిరు వ్యాపారులు మొదలుకొని, కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారరుల వరకు ఈ గిరిగిరి చిట్టీల బాధితుల్లో ఉన్నారు. తీసుకున్న అప్పు నుంచి ముందుగానే వడ్డీని తీసుకొని ఇచ్చి, వడ్డీకి వడ్డీ వసూళ్లు చేస్తన్నారు. ఇలా జిల్లాలో నెలకు రూ.10కోట్ల మేరకు ఈ గిరిగిరి దందా కొనసాగుతుందనే అంచనా.. కొన్ని సందర్భాల్లో వ్యాపారం సాగకనో.. కాంట్రాక్టర్‌కు సకాలంలో డబ్బులు రాకనో.. వ్యాపారం కలిసి రాకపోవడంతో డబ్బులు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేయడం, కుదువపెట్టిన బంగారం తక్కువ ధరకు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి.
ఆశ చూపి.. అదును చూసి..
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు కోట్లు గడిస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ.. ముందుగా ప్రజలకు దగ్గర అవుతున్నారు. అక్కడికి వచ్చిన వారితో పరిచయాలు పెంచుకొని తమకు వడ్డీకి డబ్బులు కావాలని చిన్న మొత్తంలో అప్పు తీసుకోవడం.. దానికి నెలనెలా రూ. 5పైగా వడ్డీ చెల్లించి నమ్మిస్తున్నారు. ఇలా ఏడాది కాలం చేసిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లోని వారి వద్దకూడా డబ్బులు తీసుకోవడం పరిపాటిగా మారింది. అయితే దీనిని చూసిన మహిళలు, వృద్ధులు, పెన్షనర్లు తమ డబ్బులకు అధిక మొత్తంలో వడ్డీ వస్తుందని ఆశపడి డబ్బులు ఇవ్వడం.. తర్వాత మోసపోవడం పరిపాటిగా మారింది. అదేవిధంగా మహబూబాబాద్ పట్టణంలోని కొందరు మహిళా సంఘాల నాయకురాళ్లు కూడా అధిక వడ్డీలకు ఆశపడి గ్రూపు సభ్యులను నమ్మించి లక్షల రూపాయల రుణాలు తీసుకొని రియల్ వ్యాపారులు, కాంట్రాక్టర్లకు అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్నట్లు ప్రచారం. ఈ వ్యవహారం బయటపడటం.. సభ్యులు సదరు నాయకురాళ్లను నిలదీయడం.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నట్లు ప్రచారం. కాగా, ఈ వ్యవహారంపై జిల్లా పోలీస్ బాస్ ప్రత్యేక దృష్టి పెట్టి అధిక వడ్డీలు వసూళ్లు చేస్తున్నవారితోపాటు.. అధిక వడ్డీలు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
న్యూస్‌రీల్
జిల్లాలో జోరుగా వడ్డీ వ్యాపారం
అధిక వడ్డీ ఆశచూపి భారీగా వసూలు.. అనంతరం ఉడాయింపు
చాపకింద నీరులా గిరిగిరి దందా
అత్యవసరాల్లో వ్యాపారులను
ఆశ్రయిస్తున్న సామాన్యులు
అనంతరం చెల్లించకలేక అవస్థలు
‘జిల్లాలోని బయ్యారం మండలంలో కిరాణా షాపు నిర్వాహకుడు అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపాడు. గత ఏడాదిగా తీసుకున్న డబ్బులకు ప్రతీ నెల క్రమం తప్పకుండా వడ్డీ డబ్బులు ఇచ్చాడు. ఇది కూడా ఎక్కువ మొత్తంలో వడ్డీ చొప్పున ఇచ్చి నమ్మించాడు. దీంతో చాలా మంది ఇంట్లో దాచుకున్న డబ్బులు సదరు వ్యాపారి చేతిలో పెట్టారు. ఇదే అదునుగా చూసిన వ్యాపారి ఒక్కసారిగా కనిపించకుండాపోయాడు. ఐపీ పెడుతున్నట్లు లాయర్ ద్వారా అప్పు ఇచ్చిన వారికి నోటీసులు పంపాడు. దీంతో తమకు అన్యాయం జరిగిందని అప్పులు ఇచ్చిన వారు రోడ్డెక్కి ఆందోళన చేశారు.’
‘జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న చిరు ఉద్యోగి కుటుంబ అవసరాలకోసం అప్పు తీసుకున్నాడు. అప్పటి అవసరంతో వందకు నెలకు రూ.5చొప్పున వడ్డీ చెల్లిస్తామని పత్రం రాయించుకున్నాడు. రూ. 3లక్షలు తీసుకోగా.. ప్రతీ నెల వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నాడు. ఇప్పటి వరకు రూ. 3లక్షలకు పైగా వడ్డీ చెల్లించాడు. దీనికి తోడు డబ్బులు ఇచ్చినప్పుడు మధ్యవర్తికి దావత్ పేరుతో మరో రూ. 50వేల మేరకు ఖర్చు చేశాడు. ఏడాదిగా డబ్బులు రాకపోవడంతో వడ్డీ వ్యాపారి సదరు ఉద్యోగిని బండ బూతులు తిట్టాడు. దీంతో సదరు ఉద్యోగి మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు.’
జిల్లాలో ఇలా ఒక వైపు అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వడం, గిరిగిరి దందాలు నిర్వహిస్తుండగా.. మరో వైపు అధిక వడ్డీ ఇస్తామని అమాయక ప్రజల వద్ద కోట్ల రూపాయలు తీసుకొని ఉడాయించడం వంటి సంఘటనలు జరుగుతన్నాయి.
వడ్డీల దందా..
వడ్డీల దందా..


