సాక్షిప్రతినిధి, వరంగల్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓరుగల్లు రాజకీయ పార్టీల పోరుగల్లుగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతల ప్రచార సభలతో హోరెత్తుతోంది. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు.. అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా ఓవైపు అభ్యర్థులు నిత్యం నియోజకవర్గాల్లో అలుపెరగకుండా తిరుగుతుండగా.. మరోవైపు జోష్ పెంచేందుకు అగ్రనేతలతో బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం.. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ బరిలోనే ఉన్నారు. రేపు (బుధవారం) నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కూడా ముగియనుండటంతో పోరు మరింత ఉధృతం కానుంది.
ఎన్నికల షెడ్యూల్ నుంచే మొదలైన ప్రచారం..
ఎన్నికల షెడ్యూల్ విడుదలనుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థులను ముందే ప్రకటించడంతో ఈ విషయంలో ఆ పార్టీ ముందంజలో ఉంది. చాలాచోట్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఈ నెల 5 వరకు ఖరారు కాక ఆశావహులందరూ ప్రచారంలో ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలనుంచి అభ్యర్థులు తేలడంతో అన్ని పార్టీల వారు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అక్టోబర్ 16న ఉమ్మడి వరంగల్‌లో తొలి ప్రచారసభను జనగామలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించారు. అక్టోబర్ 18న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ, సీఎల్‌పీ నేతలు రేవంతర్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, కేంద్రమంత్రులు అనురాగ్‌ఠాకూర్, అశ్వినికుమార్ చౌబే తదితరులు ఉమ్మడి వరంగల్‌లోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. అగ్రనేతల ద్వారా సభలు, ర్యాలీలు నిర్వహించి జనంలోకి వెళ్తే మరింత ఆదరణ లభిస్తుందన్న వ్యూహంతో అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి.
ఓరుగల్లు బాటలో అగ్రనేతలు..
ఉమ్మడి వరంగల్‌లో ప్రచారం హోరెత్తించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అగ్రనేతలతో వరుస సభలకు ప్లాన్ చేశాయి.
● సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలుపు కోసం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. 17న పరకాలలో, ఆ తర్వాత మూడు రోజులకు అంటే 20న స్టేషన్ ఘన్‌పూర్‌లో, ఆ మర్నాడే డోర్నకల్‌లో, 24వ తేదీన ములుగు, భూపాలపల్లిలో, 27న చివరగా వరంగల్ తూర్పు, పశ్చిమతో ముఖ్యమంత్రి సభలు పూర్తి కానున్నాయి.
● ఇప్పటికే ములుగు, భూపాలపల్లి, పాలకుర్తి నియోజకవర్గాల్లో సభలు నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గం మామునూరులో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 వరకు కూడా ఉమ్మడి జిల్లాలో ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
● ఉమ్మడి జిల్లాలో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. జూలైలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హనుమకొండ బహిరంగ సభలో పాల్గొనగా, ఆ పార్టీ తరఫున జాతీయ స్థాయి అగ్రనేతలు ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రులు అనురాగ్‌ఠాకూర్, అశ్వినికుమార్ చౌబే, ప్రచార సారథి ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు ప్రచారం నిర్వహించగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలు కూడా నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
● ఏదేమైనా ఉమ్మడి వరంగల్‌లో ఆయా పార్టీల అగ్రనేతల ప్రచారంతో ఎన్నికల పోరు క్లైమాక్స్ చేరుకుంటుంది.