మొక్కల గారడీ! | - | Sakshi
Sakshi News home page

మొక్కల గారడీ!

Nov 18 2026 1:02 AM | Updated on Nov 18 2026 1:02 AM

జూన్‌ నుంచి వర్షాలు లేవు.. కానీ అద్భుతంగా మొక్కలు నాటినట్లు లెక్కలు

ఈ నెల 17 నాటికి 30,82,473 మొక్కలు నాటినట్లు లెక్కలు

మనుగడలో ఉన్న మొక్కలు 1.09 శాతం మాత్రమే

మొక్కలు పెంచేందుకు ఏటా రూ.కోటి ఖర్చు.. ఫలితం సున్నా

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ద్వారా ఈ ఏడాది 3 లక్షల మొక్కలు నాటాలనేది లక్ష్యం. ఇందులో ఆగస్టు 4వ తేదీ నాటికే 1,82,363 మొక్కలు నాటినట్లు లెక్కలు ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా నాటినవి కలుపుకుని ఈ ఏడాది డీఆర్‌డీఏ 3,17,773 మొక్కలు నాటి 106 శాతం ప్రగతి సాధించినట్లు నమోదు చేశారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మొక్కలు నాటించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడా మొక్కలు కనిపించడం లేదు.

– జిల్లా నీటి యాజమాన్య సంస్థ అమలు చేసిన ఉపాధి హామీ పథకం కింద తుగ్గలి మండలం బొందిమడుగులలో పలువురు రైతులు పండ్ల మొక్కలు నాటుకున్నట్లు, అవన్నీ మనుగడలో ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. సుధాకర్‌ అనే రైతు 4.50 ఎకరాలు.. మరో నలుగురైదుగురు 25 ఎకరాల్లో మామిడి మొక్కలు నాటినట్లు లెక్కలు ఉన్నాయి. వీరి పొలాల్లో ఒక్క మామిడి మొక్క కూడా కనిపించదు. ఈ భూముల్లో ఇతర వ్యవసాయ పంటలు ఉండటం గమనార్హం. ఉపాధి సిబ్బంది రైతులు మొక్కలు నాటుకున్నట్లు రికార్డులు సృష్టించి బిల్లులు స్వాహా చేస్తున్నారు. డ్వామా ద్వారా ఈ ఏడాది 5 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం కాగా ఇప్పటివరకు 6,27,968 మొక్కలు (126 శాతం) నాటినట్లు చూపారు. అయితే పండ్ల మొక్కలు నాటినట్లు చెబుతున్న వందల ఎకరాల్లో మొక్కలే లేవు.

ఈ ఏడాది జూన్‌ నుంచి నవంబర్‌ వరకు చినుకు జాడ లేదు. కానీ జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం అభివృద్ధి చేసినట్లు లెక్కలు చెబుతోంది. ఈ ఏడాది 33 లక్షల మొక్కలు, 7 లక్షల సీడ్‌ బాల్స్‌ వెదచల్లాలనే లక్ష్యం నిర్ణయించారు. అయితే వర్షాలే లేకపోయినప్పటికీ ఈ నెల 17వ తేదీ నాటికి 23,82,473 మొక్కలు నాటారు. అటవీ శాఖ 7 లక్షల సీడ్‌ బాల్స్‌ చల్లింది. మొత్తం 30,82,473 మొక్కలు నాటినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. మొత్తం 35 శాఖల ద్వారా మొక్కలు నాటేందుకు జిల్లా కలెక్టర్‌ లక్ష్యాలు ఇచ్చారు. రైల్వే ఆథారిటీస్‌ వెయ్యి మొక్కలు లక్ష్యం కాగా ఒకటి కూడా నాటలేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌ 25 వేలు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 25 వేల మొక్కలు నాటాల్సి ఉండగా ఒక్కటి కూడా నాటిన దాఖలాలు లేవు. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో లక్ష మొక్కలు నాటాలనేది లక్ష్యం. 80 వేల మొక్కలు నాటినట్లు లెక్కలు ఉన్నా.. ఎక్కడా ఒక్క మొక్క కూడ కనిపించని పరిస్థితి.

నాటారు సరే.. మొక్కలు ఏవీ!

జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఆటవీ శాఖలు నర్సరీల ద్వారా మొక్కలు పెంచుతున్నారు. ఇందుకు ఏటా రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే పచ్చదనం వృద్ధి మాత్రం కరువైంది. ఈ ఏడాది 30.82 లక్షల మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నప్పటికి 10 శాతం కూడా కనిపించని పరిస్థితి. దీనిపై కొందరు అధికారులను అడిగితే మొక్కలు నాటేందుకు ప్రోగ్రాం చేయాలన్నారు.. ప్రోగ్రాం పెట్టి.. ఏదో నాటామనిపించాం. వానలే లేవు.. మీకు తెలియనిది ఏముందని అనడం గమనార్హం.

హడావుడే తప్ప.. కార్యాచరణ నిల్‌

ఏటా వివిధ సందర్భాల్లో మొక్కలు నాటడంపై చంద్రబాబు సర్కార్‌ పెద్ద ఎత్తున హడావుడి చేస్తుంది. ఆ సమయంలో ఫొటోలు దిగేందుకు కొన్ని మొక్కలు నాటడం మినహా చేసిందేమీ లేదు. దీంతో కాగితాల్లో మొక్కలు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో కనిపించని పరిస్థితి. జిల్లా మొత్తం భూభాగంలో 33 శాతం అడవులు ఉండాలి. కానీ 10 శాతం కూడా లేవు. మొక్కలు నాటి పచ్చదనం అభివృద్ధి చేయాల్సి ఉన్నప్పటికీ చిత్తశుద్ధి, జవాబుదారితనం లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement