కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి మంగళవారం భక్తులు విరివిగా విరాళాలు అందజేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. కోడుమూరుకు చెందిన డాక్టర్ సిద్ధార్థ కుటుంబ సభ్యులు 3 కేజీల వెండిని విరాళంగా దేవాలయ కార్యాలయంలో అందజేసినట్లు చెప్పారు. ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం దాతలచే స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు, పూలమాల, శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదం, బాండు, ఫొటోను అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, విజయ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ వీరేష్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక చేయూత
కర్నూలు: ఎమ్మిగనూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ 2000 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ సి.రఘు (పీసీ నంబర్ 436) ఈనెల 5వ తేదీన అనారోగ్యంతో మృతిచెందారు. ఈయనకు ఇంటర్మీడియెట్ చదువుతున్న కుమారుడు సాయిప్రణీత్, 10వ తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్విని ఉన్నారు. కానిస్టేబుల్ రఘు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు, తోటి కానిస్టేబుళ్లు ముందుకు వచ్చారు. 2004 బ్యాచ్‌కు చెందిన పోలీసులు తమ వంతు సహాయంగా సేకరించిన రూ.4.56 లక్షల చెక్కును మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా రఘు భార్య హేమలతకు అందజేశారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, 2004 బ్యాచ్ పోలీసులు, రఘు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష
చాగలమర్రి: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన నిందితుడికి ఆళ్లగడ్డ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. చాగలమర్రి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏఆర్ 01 కే 9090 నంబరుగల ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఆపి డ్రైవర్ ముకేశ్ సోంవనికి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా అతిగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ రవికుమార్ నిందితుడికి మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.


