కర్నూలు: విచారణలో ఉన్న ఖైదీల కేసుల స్థితిగతులను న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దీర్ఘకాలంగా విచారణలో ఉన్న కేసులు, బెయిల్‌కు అర్హత కలిగిన ఖైదీలు, బెయిల్ పొందిన అనంతరం విడుదలకు సంబంధించిన అంశాలు తదితర విషయాలపై సమగ్రంగా చర్చించారు. విచారణ ఖైదీల సమీక్ష కమిటీ (యూటీఆర్‌సీ), తదుపరి చర్య (ఫాలోఅప్)పై సమావేశమై చర్చించారు. ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు సూచనల మేరకు అండర్ ట్రైల్ రివ్యూ కమిటీ తదుపరి చర్యను జైళ్ల అధికారులు, జైళ్లను సందర్శించే న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెయిల్ పొందిన ఖైదీలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. అర్హత కలిగిన విచారణ ఖైదీలకు న్యాయ సహాయం అందించడం, వారి కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించడం, అవసరమైన సందర్భాల్లో సంబంధిత న్యాయస్థానాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం వంటి చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. విచారణ ఖైదీలకు చట్టపరమైన హక్కులు, బెయిల్ అంశాలు, ఉచిత న్యాయ సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్ర రావు, ప్యానల్ న్యాయవాది అబ్దుల్ అజీజ్, పారా లీగల్ వలంటీర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు బిడ్డలతో
తల్లి అదృశ్యం
ఆదోని అర్బన్: పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన నందిని ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6వ తేదీన భార్యాభర్తల గొడవ తర్వాత నందిని ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది. దీంతో నందిని భర్త శివ, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇంట్లో, స్నేహితుల ఇంట్లో వెతికినా జాడ కనిపించలేదు. మంగళవారం టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. క్రాంతినగర్‌కు చెందిన నందిని, శివ గత ఐదేళ్ల క్రితం వివాహం జరిగిందని, వారికి దేవా, శీను సంతానం. ఈనెల 6వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుందని, నందిని మనస్తాపానికి గురై ఆరోజున ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది. ఎక్కడికి వెళ్లారో తెలియకపోవడంతో టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను భర్త ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


