ఎమ్మిగనూరుటౌన్: ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌లో అధికారులు పన్నిన కుట్రనో లేక పొరపాటున చేశారో కాని 397 ఓట్లకు పైగా చెల్లకుండా పోయాయి. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల గుర్తుపై ఓటు వేసేందుకు స్వస్తిక్ గుర్తు ఉండే ముద్ర కాకుండా పోలింగ్ నంబర్ ఉండే సీల్‌ను ఓట్లర్లకు ఇచ్చారు. ఓట్లర్లంతా దానితో ఓటు చేశారు. తీరా కౌంటింగ్‌లో అవన్నీ చెల్లకుండా పోయాయి. ఇలా గ్రామంలోని పోలింగ్ కేంద్రాల్లో చాలా ఓట్లు చెల్లకుండా పోయాయని, ఇది పోలింగ్ సిబ్బంది పొరపాటున చేశారా లేక కుట్రనా అని అభ్యర్థులు ఆరోపించారు. దీంతో గెలుపొందిన అభ్యర్థులు తమకు మెజారిటీ తగ్గిందని పేర్కొనగా ఓడిన అభ్యర్థులు తమకు మరిన్ని ఓట్లు వచ్చేవని ఈ సందర్భంగా తెలిపారు.
కర్నూలు(అర్బన్): జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ‘పచ్చ’నేతలు సాగించిన కుట్రలు ఓట్ల లెక్కింపుతో బహిర్గతమయ్యాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసేంతవరకు ఎలాగైనా తమ పంతం నెగ్గించుకునేందుకు టీడీపీ నేతలు అనేక రూపాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ నేతలను అడుగడుగునా ఇబ్బందులకు గురి చేశారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా వ్యతిరేకత అంతకంతకు పెరుగుతున్నా, ప్రజాదరణ తమకే ఉందనే భ్రమను కలిగించేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వివిధ రూపాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వైఎస్సార్‌సీపీకి మంచి పట్టు ఉన్న గ్రామాల్లో కూడా నామినేషన్లను అడ్డుకోవడం, దర్జాగా సైక్లింగ్, రిగ్గింగ్ చేసుకొని ప్రజల ఓట్లతోనే విజయం సాధించామని సంకలు గుద్దుకుంటున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నా, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కూడా
ఏజెంట్ల అడ్డగింత
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి కూడా వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను వెళ్లనీయకుండా పలు ప్రాంతాలో అడ్డుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే ఆలూరులో ఏజెంట్ల పాసులు తీసుకొని కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు, పోలీసులు, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అలాగే ... పలు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తే, డిక్లరేషన్ ఇవ్వకుండా ఇబ్బంధులు పెట్టడమే గాక, రీకౌంటింగ్ పేరుతో కాలయాపన చేశారు. అదే టీడీపీకి చెందిన అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో బయటపడితే వెంటనే డిక్లరేషన్ ఇవ్వడం గమనార్హం. మొత్తం మీద ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా జరిపించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించారు.
115 ఎంపీటీసీ స్థానాల్లో జయకేతనం
అనేక రూపాల్లో ఒత్తిళ్లు, దాడులు, దౌర్జన్యాలు చేసినా, జిల్లాలో 115 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. పలు ప్రాంతాల్లో టీడీపీకి మంచి పట్టు ఉన్న స్థానాల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే ఆదోని –1, ఆస్పరి, దేవనకొండ, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కోడుమూరు, కోసిగి, మంత్రాలయం, తుగ్గలి, వెల్దుర్తి , ఓర్వకల్లు మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పట్టు నిలుపుకున్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన అధికార పార్టీ
కౌంటింగ్‌లో ఆటంకాలు సృష్టించిన
టీడీపీ నేతలు
ఏజెంట్లను అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు
కౌంటింగ్‌లో యథేచ్ఛగా ‘పచ్చ’పాతం
కుట్రలను ధైర్యంగా అడ్డుకున్న
వైఎస్సార్‌సీపీ నేతలు
115 ఎంపీటీసీ స్థానాల్లో
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం
వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి
ఐదు జెడ్పీటీసీ స్థానాలు


