తగ్గుతున్న ఉల్లి ధరలు | - | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న ఉల్లి ధరలు

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

● కర్నూలు మార్కెట్‌లో

క్వింటా రూ.3,798

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు మార్కెట్‌లో ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. మార్కెట్‌కు శనివారం 4,360 క్వింటాళ్ల(178 లాట్లు) ఉల్లి రాగా.. కనిష్ట ధర రూ.629, గరిష్ట ధర రూ.3,728 లభించగా.. సగటు ధర రూ.3,189 నమోదైంది. వేరుశనగ మార్కెట్‌కు 101 క్వింటాళ్లు వచ్చింది. కనిష్ట ధర రూ.5,700 లభించగా.. గరిష్ట ధర రూ.9,471.. సగటు ధర రూ.9,329 పలికింది. మొక్కజొన్న ధర కాస్త తగ్గింది. కనిష్ట ధర రూ.2,563.. గరిష్ట ధర రూ.2,840 లబించింది. మిర్చి రెడ్‌ రకానికి కనిష్ట ధర రూ.14,099 లభించగా.. గరిష్ట ధర రూ.23,129.. సగటు ధర రూ.16,799 నమోదైంది.

ఓటు హక్కు నమోదు చేసుకోండి

కర్నూలు(సెంట్రల్‌): అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో ఉంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. సర్‌ పేరతో ఓటర్లను తొలగిస్తూ పోతోందని ఆరోపణలు రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సర్‌లో తొలగించిన ఓటర్లపై మరోసారి విచారణ చేయాలని నిర్ణయించింది. అర్హులైన వారిని తొలగించి ఉంటే వారి నుంచి ఫారం–6 తీసుకునేలా బీఎల్‌ఓలను ఆదేశించారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కూడా ఫారం–6 తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి తెలిపారు.

10 నుంచి కార్తీక మాసోత్సవాలు

బనగానపల్లె: పవిత్రశైవక్షేత్రమైన యాగంటి దేవస్థానంలో ఈ నెల 10 నుంచి కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, చైర్మన్‌ బండి మౌలీశ్వరరెడ్డి తెలిపారు. డిసెంబరు 8వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు కొనసాగుతాయన్నారు. 16వ తేదీన మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాబిషేకాలు, కుంకుమార్చనలు సహస్త్రనామావలి, మహానివేదిత, ఉచిత ప్రసాద వితరణ, స్వామివారి పల్లకీ సేవ, 24న కార్తీక పౌర్ణమి రోజు లక్షదీపోత్సవ కార్యక్రమం, సాయంత్రం 8 గంటలకు పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

తగ్గిన మొక్కజొన్న దిగుబడులు

ఉయ్యాలవాడ: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన మొక్కజొన్న దిగుబడులు గణనీయంగా తగ్గాయి. మండలంలో ఇంజేడు, ఉయ్యాలవాడ, పెద్దయమ్మనూరు, మాయలూరు, అల్లూరు, తదితర గ్రామాల పరిధిలో 328 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత, నూర్పిడి పనులు జరుగుతున్నాయి. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు వర్షాలు లేక పంట దిగబడులు తగ్గాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయని రైతులు తెలిపారు. పంట సాగుకు రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సేద్యాలు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలుపెట్టుబడులు వచ్చాయన్నారు. దిగుబడులు ఇళ్లవద్ద నిల్వ చేసుకునేందుకు కూడా వసతులు లేకపోవడంతో రహదారులపై ఆరబెట్టుకున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న మార్కెట్‌లో క్వింటా ధర రూ. 2,500 పలుకుతోంది. కౌలు రైతులు ఎకరాకు ముందస్తు రూ. 25 వేలు కౌలు చెల్లించి పంట సాగు చేశారు. తీరా దిగుబడులు ఎకరాకు 15 క్వింటాళ్లలోపే వస్తుండటంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర క్వింటా రూ. 4 వేలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement