కౌంటింగ్‌లో ‘పచ్చ’పాతం | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌లో ‘పచ్చ’పాతం

Nov 8 2026 4:47 AM | Updated on Nov 8 2026 4:47 AM

● రీకౌంటింగ్‌ అడిగితే పోలీసుల దౌర్జన్యం

● ఆందోళన చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ఎమ్మిగనూరుటౌన్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో పోలీసులు, అధికారులు ‘పచ్చ’ పాతం చూపించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం ఉదయం నుంచి మూడు మండలాల కౌంటింగ్‌ అధికారులను ప్రారంభించారు. గోనెగండ్ల 3వ ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కడపల రాణి ఆరు ఓట్లతో ఓడిపోవడంతో రీకౌంటింగ్‌కు ఆమె అడిగారు. ఆమెను గోనెగండ్ల సీఐ బెదిరించి దౌర్జన్యంగా బయటికి పంపించారు. అయితే గోనెగండ్ల ఒకటో ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేయడంతో పోలీసులు దగ్గరుండి జరిపించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మెజార్టీ రావడంతో చేసేదేమి లేకపోయారు. అలాగే చిన్నమరివీడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి 46 ఓట్లతో గెలుపొందగా టీడీపీ వారు రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేశారు. రీకౌంటింగ్‌ చేస్తే మరో రెండు ఓట్లు పెరిగి 48 ఓట్ల మెజారిటీ వచ్చి వైఎస్సార్‌సీపీ అభ్యర్థే గెలుపొందారు.

వైఎస్సార్‌సీపీ నాయకుల ఆందోళన

టీడీపీ అభ్యర్థులు ఓడిపోయిన గ్రామాల్లో పోలీసులు దగ్గరుండి రీకౌంటింగ్‌ చేయించడంపై వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు బీఆర్‌ బసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఽధికారుల తీరుగా వైఎస్సార్‌సీపీ నాయకులు కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. టీడీపీ శ్రేణులు అక్కడే ఉండి రెచ్చగొట్టడంతో పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులపై లాఠీచార్జ్‌ చేసి తరిమారు. ఇదిలా ఉండగా.. కౌంటింగ్‌ కేంద్రంలోకి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్‌ను పోలీసులు అనుమంతించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు బైఠాయించాయి. టీడీపీ నాయకుడిని ఎలా అనుమతిస్తారని, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌తో ఆయనకు ఏమి సంబంధమని ప్రశ్నించారు. ఆందోళన ఉధృతం కావడంతో టీడీపీ నాయకుడిని పోలీసులు బయటికి పంపించారు. కాగా.. ఎమ్మిగనూరు మండలంలో 8 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 13 స్థానాల్లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపొందారు. నందవరం మండలంలో 16 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి గెలుపొందారు. గోనెగండ్ల మండలంలో తొమ్మిది స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కౌంటింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎన్నికల పరిశీలకులు అనీల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రంలో కూర్చోనేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో చెట్ల కింద ఉండాల్సి వచ్చిందని ఏజెంట్లు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement