రెండు వార్డుల డిక్లరేషన్‌పై రగడ | - | Sakshi
Sakshi News home page

రెండు వార్డుల డిక్లరేషన్‌పై రగడ

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

కౌంటింగ్‌ కేంద్రంలోనే మంత్రి ఫరూక్‌ తనయుడు ఫిరోజ్‌ ఘర్షణ

కౌంటింగ్‌ కేంద్రంలోనే మంత్రి ఫరూక్‌ తనయుడు ఫిరోజ్‌ ఘర్షణ

● రీకౌంటింగ్‌ పెట్టాలంటూ అధికారులపై ఒత్తిళ్లు

● మెజార్టీ వచ్చినా ఫలితాలను ప్రకటించని అధికారులు

● డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పారవి డిమాండ్‌

● రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన రిటర్నింగ్‌ అధికారులు

నంద్యాల(అర్బన్‌): నంద్యాల మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిన రెండు వార్డుల డిక్లరేషన్‌ విషయంలో టీడీపీ నాయకులు పేచీ పెట్టారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్‌ వార్డుల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తుండటంతో జీర్ణించుకోలేని మంత్రి ఫరూక్‌ తనయుడు ఫిరోజ్‌ రెండు వార్డుల ఫలితాలపై రీ కౌంటింగ్‌కు డిమాండ్‌ చేస్తూ డిక్లరేషన్‌ ఫారాల అందజేతకు అడ్డుపడ్డారు. పట్టణంలోని 20వ వార్డు అభ్యర్థి వెంకటరెడ్డి టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వర్లుపై 8 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. రెండు ఓట్లలో స్వస్తిక్‌ సక్రమంగా పడలేదంటూ అక్కడున్న ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. రెండు ఓట్లు పోయినా 6 ఓట్లతో గెలుపును ప్రకటించాలని మల్లు వెంకటరెడ్డి కోరినా డిక్లరేషన్‌ ఫారం ఇచ్చేందుకు ఎన్నికల అధికారులు సుముఖత చూపలేదు. 52వ వార్డులో సైతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సావిత్రమ్మ మొదట 20 ఓట్లతో గెలుపొందడంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. రీ కౌంటింగ్‌లో 12 ఓట్ల మెజార్టీ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మరోమారు రీకౌంటింగ్‌ నిర్వహించాలని టీడీపీ నాయకులు పట్టుబట్టారు. ఇదిలా ఉంటే గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఫారం ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్కడున్న రిటర్నింగ్‌ అధికారులను నిలదీశారు. సమయం తక్కువగా ఉందని, డిక్లరేషన్‌ ఫారాలు అందరికీ ఇస్తామంటూ అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఇందుకు మాజీ ఎమ్మెల్యే శిల్పా స్పందిస్తూ తక్షణమే అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఫారం ఇవ్వాలని, లేని పక్షంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదే సమయంలో మంత్రి ఫరూక్‌ కుమారుడు ఫిరోజ్‌ అక్కడికి రావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కూర్చొని వార్డు అభ్యర్థుల డిక్లరేషన్‌ ఫారాల పంపిణీపై రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన శిల్పారవి ఆయన అక్కడ ఉండటాన్ని వ్యతిరేకించడంతో వాతావరణం రసాభాసగా మారింది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలో జరుగుతున్న ఘటనను తెలుసుకున్న కలెక్టర్‌ రాజకుమారి హుటాహుటినా అక్కడికి చేరుకున్నారు. గెలుపొందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు తక్షణమే డిక్లరేషన్‌ ఫారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

నంద్యాల మున్సిపాలిటీలో ఉత్కంఠ

నంద్యాల మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి దాల్‌మిల్‌ అమిర్‌ బాషా, టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ బాబన్‌ మధ్య ఉత్కంఠ పోరు సాగుతోంది. మొత్తం 52 వార్డులున్న మున్సిపాలిటీలో రాత్రి 12 గంటల సమయానికి వైఎస్సార్‌సీపీ 25 వార్డుల్లో గెలిచినట్లు తెలుస్తోంది. టీడీపీ 27 వార్డుల్లో విజయం సాధించినట్లు అధికారులు చెప్పినా ధ్రువీకరణ చేయలేకపోయారు. నంద్యాల మున్సిపాలిటీలో విజయం సాధించేందుకు పచ్చ పార్టీ పోలింగ్‌ నాడు అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేసింది. అయితే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి నంద్యాలలో మకాం వేసి అన్నీ తానై వ్యవహరించారు. ఢీ అంటే ఢీ అంటూ అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పార్టీ కేడర్‌తో పాటు ఓటర్లలో ధైర్యాన్ని నింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement