న్యాయమే గెలిచింది | - | Sakshi
Sakshi News home page

న్యాయమే గెలిచింది

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

నందికొట్కూరు: మున్సిపాలిటీ ఎన్నికల్లో నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ చైర్‌ పర్సన్‌తో పాటు 23 వార్డుల్లో తమ కౌన్సిలర్లు గెలవడంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక దౌర్జన్యాలకు పాల్పడినా.. అధికారులను బెదిరించినా చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు కొనసాగింది. కాగా ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందుతుండటంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక కౌంటింగ్‌కు ఆటంకం కలిగించారు. అన్ని వార్డుల్లో రీ కౌంటింగ్‌ చేయాలంటూ అధికారులను బెదిరించారు. సర్దిచెప్పబోయిన ఆత్మకూరు రూరల్‌ సీఐ సురేష్‌ కుమార్‌రెడ్డిని చుట్టుముట్టి దాడి చేసినంత పని చేశారు. పక్కనే ఉన్న పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాగా టీడీపీ నేతల చేష్టలను తెలుసుకున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, డాక్టర్‌ దారా సుధీర్‌, నియోజకవర్గ పరిశీలకుడు బుడ్డా శేషారెడ్డి వెంటనే నందికొట్కూరు–నంద్యాల రోడ్డుపై ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కౌటింగ్‌ సమీపంలోని రోడ్డుపైకి చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్‌ నిర్వహిస్తామని డీఎస్పీ రామాజంనేయులు నాయక్‌ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో పచ్చ గూండాలు దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. నామినేషన్‌ మొదలు, ఓట్ల లెక్కింపు వరకు తమ అభ్యర్థులను భయపెట్టాలని చూశారన్నారు. వైఎస్సార్‌సీపీ విజయాన్ని జీర్ణించుకోలేక కౌంటింగ్‌కు ఆటంకం కలిగించడమే కాకుండా అధికారులు, పోలీసులను బెదిరించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాము నిరసనతో అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ షేక్‌ ఫాతిమాబీని, కౌన్సిలర్లను గెలిపించిన నందికొట్కూరు పట్టణ ప్రజల రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. పట్టణాభివృద్ధిని చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement