● 3 వేల మంది సిబ్బందితో కార్యాచరణ ప్రణాళిక ● జిల్లాలో 255 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల గుర్తింపు ● ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు: పల్లె పోరుకు పోలీసు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఓట్ల లెక్కింపుతో పురపాలక సంఘాల ఎన్నిక ఘట్టం ముగిసింది. ఇక మండల ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఈనెల 5న పోలింగ్, 7న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు, బందోబస్తు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని 3 వేల మంది సిబ్బందితో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పోలీసులు పురపాలక సంఘాల ఎన్నికలకు సుమారు వారం రోజుల పాటు బందోబస్తు నిర్వహించారు. పురపోరులో అమలు చేసిన విధానాన్నే పల్లె పోరులో అమలు చేసేందుకు పోలీసు శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. బందోబస్తుకు సిబ్బంది నియామకం, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద తలెత్తే వివాదాలను సర్దుబాటు చేసేందుకు తీసుకోవలసిన చర్యలు తదితర వాటిని దృష్టిలో పెట్టుకుని భద్రత విధులకు సిబ్బందిని కేటాయిస్తున్నారు.
అదనపు బలగాలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గడువు కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. దీంతో పోలీసు శాఖ బందోబస్తు కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలో 22 జెడ్పీటీసీలు, 358 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 1,432 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 94 అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో 299 పోలింగ్ కేంద్రాలు, 161 సమస్యాత్మక గ్రామాల పరిధిలో 398 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆయా ప్రాంతాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించి అదనపు బలగాలను మొహరించనుంది. ఇందుకోసం ఏపీఎస్పీ నుంచి 13 ప్లటూన్ల సిబ్బందిని వినియోగించనున్నారు. అలాగే 400 మంది ఏఆర్ సిబ్బంది, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మరో 100 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను వినియోగించనున్నారు. అలాగే వీడియో చిత్రీకరణ ఉంటుంది. 26 మండలాలను 85 జోన్లుగా, 171 రూట్లుగా విభజించి అందుకు తగ్గట్టుగా వివిధ విభాగాల పోలీసు అధికారులు, సిబ్బందిని విధులకు కేటాయించనున్నారు.


