సుగ్గి బాటలో ఓటు బుగ్గి... | - | Sakshi
Sakshi News home page

సుగ్గి బాటలో ఓటు బుగ్గి...

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

బతుకు భారమైంది మాకేల ఓట్లు

ఊళ్లలో పనులు ఏమీ లేవు. కుటుంబం గడవడం కష్టమైంది. వేరే గత్యంతరం లేక తెలంగాణలోని నాగర్‌ కర్నూలుకు పత్తి తీసేందుకు సుగ్గికి వచ్చాం. మా ఊరోళ్లు 20 మందికి పైగా ఇక్కడే పనులు చేసుకుంటున్నాం. ఓటు వేయడానికి రావాలంటే లేనిపోని ఖర్చులు. పని పోగొట్టుకుంటే మళ్లీ దొరకడం కష్టం. అందుకే ఓటు గురించి ఆలోచించే పరిస్థితి లేదు.

– జంబన్న, వ్యవసాయ కూలీ

వానల్లేక మా ఊర్లో కూలీ పనులు అయిపోయాయి. కూలీనాలీ చేసుకునే మాకు సుగ్గి తప్పదు. మా ఇంటిల్లిపాది తెలంగాణలోని మారేపల్లికి వచ్చాం. మాతోపాటు మా ఊరొళ్లు వచ్చారు. ఎర్రకోట నుంచి ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నాం. పూట గడవని వేళ ఓట్లు యాడ వేస్తాం. పనులు ఉన్నన్నాళ్లూ ఇక్కడే పనిచేసుకోవాలనుకునుకుంటున్నాం. – కడబూరు, వ్యవసాయ కూలీ

వాన జాడలేక నేలతల్లి చిన్నబోయె..

నేలతల్లిని నమ్ముకున్న బతుకుల్లో

నైరాశ్యం నిండిపాయె..

కూలినాలి కరువై పూట గడవడం కష్టమాయె..

ఇల్లు విడిచి పొరుగూళ్లలో సుగ్గి శరణ్యమాయె!

మంత్రాలయం: ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు ఆసన్నమైనా వలస జీవులు సుగ్గిలోనే ఉండిపోయారు. పూట గడవని వేళ తమకెందుకు ఓట్లు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమరంలో సుగ్గి ఎఫెక్టు తప్పదని స్థానికులు చర్చించుకుంటున్నారు. బరిలో నిలబడే ఆర్థిక బలం కలిగిన నేతలు వలస కూలీలను రప్పించుకునేందుకు రాయబారాలు మొదలెట్టే అవకాశం ఉంది. పిలుపు లేకుంటే కరువు జీవులు సుగ్గిలోనే సాగిపోయె పరిస్థితి.

సుగ్గిలో 10 వేల కుటుంబాలు

వ్యవసాయ పనులు లేకపోవడం, వీబీజీ రాంజీ ఉపాధిపై నమ్మకం సన్నగిల్లడంతో వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు, కూలీలు సుగ్గిబాట పట్టాల్సి వచ్చింది. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల నుంచి 10 వేల కుటుంబాలు వలస వెళ్లినట్లు అంచనా. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి, మంత్రాలయం, కౌతాళం మండలాల నుంచి అత్యధికంగా సుగ్గికి పోయారు. కోసిగి మండలంలో 5 వేల మందికిపైగా వలస వెళ్లారు. వీరు కర్ణాటకలో పత్తి కోత పనులకు వెళ్లారు. ఇక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎర్రకోట, గుడేకల్‌, కడివెళ్ల, సోమలగూడూరు, పొనకలదిన్నె, మాచాపురం గ్రామాల నుంచి తరలివెళ్లారు. వీళ్లు తెలంగాణలోని నాగర్‌ కర్నూలు జిల్లా మారేపల్లి గ్రామం ప్రాంతంలో పత్తి సుగ్గి చేసుకుంటున్నారు.

ఆయ‘కట్‌’తోనే ఆపసోపాలు

జిల్లా పశ్చిమ ప్రాంతానికి తుంగభద్ర దిగువ కాలువ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలు, గాజులదిన్నె ప్రాజెక్టు, పులికనుమ ప్రాజెక్టు, తుంగభద్ర నదీ జలాలే ప్రధాన ఆధారం. వానలు లేని తరుణంలో సాగుకు ఈ ప్రాజెక్టులే శరణ్యం. అయితే వర్షాభావ పరిస్థితుల రీత్యా ఈ ఏడాది ప్రాజెక్టులన్నీ ఎండిపోయాయి. గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో 50 ఎకరాలకు సాగునీరు లేకుండాపోయింది. పులికనుమ ప్రాజెక్టుకు నీటి చెమ్మ కరువైంది. కాస్తోకూస్తో నమ్మ కం పెట్టుకున్న ఎల్లెల్సీ పంట కాలువలకు నీరు లేకపోయింది. ఖరీఫ్‌, రబీ సీజన్‌లో లక్ష ఎకరాలకు నీరు పారాల్సి ఉండగా సెంటు భూమి తడవని వైనం. ఎల్‌నినో సాకుతో ఎల్లెల్సీ నీటి వాటా వినియోగాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది. ఆదుకోవాల్సిన ఆయకట్టు దూరం కావడంతో వలసల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

వలస బాటలో జిల్లా పశ్చిమ పల్లెలు

నియోజకవర్గంలో 10 వేల జనాభా

కర్ణాటక, తెలంగాణలో సుగ్గి

స్థానిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం

పడిపోయే ప్రమాదం

గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించని

ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement