ముగిసిన బన్ని మహోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన బన్ని మహోత్సవాలు

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

● నెరణికి గ్రామానికి చేరిన మాళమల్లేశ్వర ఉత్సవ విగ్రహాలు

హొళగుంద: రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న దేవరగట్టు దసరా బన్ని మహోత్సవాలు ఆదివారం ముగిశాయి. మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో గ్రామంలో దరసరా పండుగను ఈ రోజు జరుపుకున్నారు. జైత్రయాత్ర అనంతరం శనివారం దేవరగట్టులో గొరువయ్యల ఆటలు ఇతర కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులకు కంకణ విసర్జన చేసి అదే రోజు రాత్రి విగ్రహాలను కొండ దిగువన ఉన్న కాడసిద్ధప్ప మఠానికి చేర్చారు. ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు పూజారులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత విగ్రహాలు, పల్లకీని నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తుల మధ్య గొరువయ్యలు ఊరేగింపుగా నెరణికి గ్రామం ఊరువాకిలి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి ముందుకు చేర్చి అక్కడ కొద్దిసేపు కొలువుంచారు.

ఘనంగా దసరా వేడుకలు..

ఉత్సవ విగ్రహాలు ఆదివారం నెరణికి గ్రామానికి చేరడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. బన్ని ఉత్సవాలనంతరం ఈ గ్రామంలో దసరా వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దేవరగట్టు నుంచి గ్రామానికి చేరిన విగ్రహాలను ఆంజనేయస్వామి ఆలయం ముందు కొలువుంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయం నుంచి విగ్రహాలను అర్చకుల ఇంటి వరకు పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపులో చిన్నారులు ‘బన్ని’ (కర్రలు పట్టుకుని ఎగరడం) ఆడుకుంటూ, మహిళలు కలశాలు పట్టి విగ్రహాలను ఉంచే అర్చకుల ఇంటికి చేర్చారు. మాళమల్లేశ్వరుని కంకణ ధారణ నుంచి నిష్టతో ఉన్న ప్రజలు సోమవారం ముగింపు వేడుకలను ఘనంగా జరుపుకుని దీక్షను విరమించారు. హొళగుంద ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌, సిబ్బంది బందోబస్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement