ఆదోని రూరల్/సెంట్రల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరపున నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వారిపై టీడీపీ నాయకులు దాడులు చేశారు. పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను సైతం చించి పడేశారు. ఆదోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆదోని మండలం–1, ఆదోని మండలం–2 నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. టీడీపీకి చెందిన నాయకులు తమ అనుచరులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలను పిలిపించుకుని గురువారం ఉదయం నుంచే అక్కడ ఉన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే వారిపై దాడులు చేశారు. విరుపాపురం గ్రామం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి ఇద్దరితో కలసి వస్తున్న నరసప్పను టీడీపీ నాయకుడు చిన్నగొనేహాల్ గోపాల్‌రెడ్డి అడ్డుకున్నాడు. నామినేషన్ పత్రాలను లాక్కొని పక్కనే ఉన్న డ్రైనేజీ కాలులో పడేశాడు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థితో పాటు వచ్చిన నాయకులు ప్రతిఘటించగా టీడీపీ గూండాలు దాడి చేశారు. తాలూకా సీఐ నల్లప్ప, ఎస్‌ఐ రామాంజనేయులు, పలువురు సిబ్బంది సమక్షంలోనే వారి పత్రాలను లాక్కొని పడేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహిళ అని చూడకుండా...
వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి దిబ్బనకల్ గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా ఈరమ్మ అనే మహిళ నామినేషన్ వేసేందుకు వెళ్లగా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను చించి పడేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కడే నిరసన తెలియజేయడంతో పోలీసులు కలుగజేసుకుని మరలా నామినేషన్ వేయాల్సిందిగా సూచించారు. తిరిగి సాయంత్రం దిబ్బనకల్ ఎంపీటీసీ అభ్యర్థిగా ఈరమ్మ నామినేషన్ దాఖలు చేశారు. మిగతా గ్రామాల నుంచి నామినేషన్లు వేయడానికి వస్తున్న వారిని అడ్డుకుని తిరిగి వాపసు పంపించారు. దీంతో ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటికి వెళ్లి నాయకులు తెలియజేశారు. నామినేషన్ వేయడానికి మరొకరోజు గడువు ఉండడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులంతా కలిసి నామినేషన్ వేయడానికి వస్తున్నట్లు భరోసా ఇచ్చారు.
దాష్టీకం.. రౌడీయిజం
● పోలీసుల లాఠీచార్జ్
పత్తికొండ/రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించారు. పత్తికొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం దగ్గర గురువారం భయాందోళన సృష్టించారు. వైఎస్సార్‌సీపీ తరఫున జూటూరు, చక్రాళ్ల ఎంపీటీసీ అభ్యర్థులు హరిజన శ్రీనువాసులు, పులికొండ నర్సయ్యలు నామినేషన్ వేయడానికి నాయకులతో కలసి వస్తున్న సమయంలో టీడీపీ గుండాలు అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడానికి ప్రయత్నాలు చేశారు. సీఐ నాగరాజా రావు తన సిబ్బందితో వారిని అడ్డుకున్నారు. అయితే టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులపైనే దాడులకు పాల్పడుతూ ఉండటంతో లాఠీచార్జ్ చేశారు. గొడవ సద్దుమణిగిన తరువాత వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కేంద్రంలోకి వెళ్లి ప్రశాంతంగా నామినేషన్లు వేశారు.
ఆదోనిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై
టీడీపీ నాయకుల దాడి
పత్తికొండలో నామినేషన్ పత్రాలు
చించివేయడానికి యత్నం
తుగ్గలిలో పట్టుడు కట్టెలతో హల్‌చల్


