కర్నూలు: పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో జిల్లా పరిషత్ ప్రాంతం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. బారీకేడ్లు, ఇనుప కంచెలతో రోడ్లను మూసివేయడంతో ఆ మార్గంలో కనీసం కాలినడకన కూడా వెళ్లేందుకు అవకాశం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలోమీటర్ పొడవునా రోడ్లను మూసివేయడమే కాక జిల్లాపరిషత్‌కు ఎదురుగా ఉన్న వ్యాపార దుకాణాలను పోలీసులు మూసివేయించారు. దీంతో వ్యాపారులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. కనీసం కాలినడకన కూడా వెళ్లేందుకు అనుమతించకపోవడంతో మహిళలు, వృద్ధులు తిట్టుకుంటూ మరో మార్గంలో వెళ్తూ పోలీసులను తిట్టుకోవడం కనిపించింది.
విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుల హల్‌చల్
కేడీసీసీబీ చైర్మన్, టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ఆ ప్రాంతంలో హల్‌చల్ సృష్టించారు. కర్నూలు రూరల్ మండలానికి సంబంధించిన ఎంపీటీసీలు జిల్లాపరిషత్ ఆవరణలోని కర్నూలు ఎంపీపీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీకి చెందిన వారు తప్ప ఇతరులు ఎవరూ నామినేషన్లు వేయకుండా జిల్లాపరిషత్ సమీపంలోని ఐదు ప్రాంతాల్లో కాపు కాసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. సమీపంలోనే రాజధాని బార్, మధువన్ బార్ ఉండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రౌడీమూకలు బార్లలో మద్యం సేవిస్తూ ఆయా ప్రాంతాల్లో కాపు కాసి హల్‌చల్ సృష్టించారు. అయితే పోలీసులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరించారు.
విద్యార్థులు, పేషెంట్ల రిపోర్టు చించివేత
ఆ మార్గం గూండా ఆసుపత్రికి వెళ్లే రోగులు పట్టుకున్న రిపోర్టులను, విద్యార్థులు తీసుకెళ్తున్న సర్టిఫికెట్లను కూడా తెలుగుదేశం గూండాలు నామినేషన్ పత్రాలుగా భావించి చించివేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ మార్గం గూండా కాగితాలు పట్టుకుని ఎవరు వెళ్లినా నామినేషన్లు వేయడానికే వెళ్తున్నారని భావించి నిరక్షరాస్యులైన విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు మద్యం మైకంలో దుర్మార్గంగా వ్యవహరించడం గమనార్హం. ఈ దృశ్యాలను చూసి ఓ హెడ్ కానిస్టేబుల్ పైఅధికారులు సరిగా లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని బాధ పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. నా 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని.. నామినేషన్ కేంద్రానికి నాలుగు వైపులా తెలుగుదేశం గూండాలు తిష్ట వేసి అరాచకం సృష్టిస్తున్నా పైఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్లే తాము మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పేరుతో హడావుడి చేయడం తప్పిస్తే ఏమీ చేయలేకపోతున్నామని అక్కడున్న వారితో చెప్పుకొని బాధ పడటం గమనార్హం.


