కర్నూలు(సెంట్రల్): జిల్లా పరిషత్ కార్యాలయం,ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పరిశీలనకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్, కంప్లైంట్ సెల్ ద్వారా ఎన్నికలకు సంబంధించి అందిన ప్రతి ఫిర్యాదును నమోదు చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు వాటిపై స్పందిస్తూ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
నేడు కర్నూలుకు ఆప్కాబ్ ఎండీ
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు(ఆప్కాబ్) మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణయ్య ఈ నెల 23న కర్నూలుకు రానున్నారు. ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఆయన తనిఖీ చేయనున్నారు. అదే విధంగా బ్యాంకు సాగిస్తున్న పాలన వ్యవహారాలు, రుణాల పంపిణీ, రికవరీలు, ఎన్‌పీఏ తదితరాలపై కర్నూలులోని ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని డీసీసీబీ సీనియర్ అధికారులు తెలిపారు.
క్వింటా ఉల్లి రూ.4,454
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్‌కు 938 క్వింటాళ్లు(40 లాట్లు) వచ్చాయి. కనిష్ట ధర రూ.3,419, గరిష్ట ధర రూ.4,454 లభించగా.. సగటు ధర రూ.3,419 నమోదైంది. ఈ సారి మొక్కజొన్న పంట అతి తక్కువగా ఉంది. మార్కెట్‌కు కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే మొక్కజొన్నలు వచ్చాయి. క్వింటాకు రూ.2,701 ధర లభించింది. వేరుశనగకు కనిష్ట ధర రూ.5,598, గరిష్ట ధర రూ.8,089 లభించగా.. సగటు ధర రూ.7299 నమోదైంది. మార్కెట్‌లో మిర్చికి అంతంతమాత్రం ధరలే లభిస్తున్నాయి. ఎరుపు రకం కనిష్ట ధర రూ.13,259 లభించగా.. గరిష్ట ధర రూ.17,239.. సగటు ధర రూ.15,599 పలికింది.
30న ప్రభుత్వానికి ఇన్‌పుట్ సబ్సిడీ నివేదిక
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని కరువు మండలాలకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ నివేదికను ఈ నెల 30న వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్‌ల ద్వారా ప్రభుత్వానికి పంపడానికి చర్యలు చేపట్టింది. స్థానిక సంస్థల నామినేషన్‌ల ప్రక్రియ జరుగుతుండటం, వీఏఏ, వీఆర్‌వోలు, ఏవోలకు ఎన్నికల డ్యూటీలు వేయడంతో ఎన్యూమరేషన్ ప్రక్రియ మందగించింది. ఇప్పటి వరకు 60 నుంచి 70 శాతం వరకు ఎన్యూమరేషన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఒక రైతుకు ఎన్ని హెక్టార్ల భూమి ఉన్నా.. ఎన్ని రకాల పంటలు సాగు చేసినా కేవలం రెండు హెక్టార్లకు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ లభిస్తుంది. ఈ నెల 25లోపు ఎన్యూమరేషన్ పూర్తి చేసే విధంగా వ్యవసాయ శాఖ షెడ్యూలు ఇచ్చింది. ఈ నెల 26 నుంచి 28 వరకు రైతుసేవా కేంద్రాల్లో జాబితాలను సోషల్ ఆడిట్‌కు పెడతారు. వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత 29న జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయాలకు పంపుతారు. వాటిని క్రోడీకరించిన తర్వాత జిల్లా కలెక్టర్‌ల ద్వారా ప్రభుత్వానికి నివేదికను పంపనున్నారు.
టీడీపీ నేతల
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ఆలూరు రూరల్: నామినేషన్ కేంద్రం వద్ద ఎన్నికల నిబంధలను టీడీపీ నేతలు ఉల్లంఘించారు. బుధవారం ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి కుమారుడు, ఆలూరు ఎంపీపీ అభ్యర్థి శ్రీరామ్ ప్రచార రథంతో పాటు ఐదు వాహనాల్లో ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వచ్చారు. అంతటితో ఆగకుండా సుమారు 50 మంది కార్యకర్తలతో కలిసి నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మాత్రం ఇద్దరితో నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు. ఎన్నికల కోడ్ అమలును పర్యవేక్షించాల్సిన అధికారుల సమక్షంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చకు దారితీశాయి.


