ధరలన్నీ పెరిగాయి
ఖర్చు పెరిగింది
కర్నూలు(అగ్రికల్చర్): దసరా..హిందువులు ఘనంగా జరుకునే పండుగ. దూరప్రాంతాల్లో వివిధ ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ పండుగకు స్వగ్రామాలకు వస్తారు. కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా ఉంటారు. అయితే ఈ సారి నిత్యావసరాల ధరలు పెరగడంతో గ్రామాల్లో నిస్తేజం, నిరుత్సాహం నెలకొంది. ఎవరిని కదిలించినా కన్నీటి కష్టాలు బయటికి వస్తున్నాయి. గత 50 ఏళ్లుగా ఇటువంటి దుర్భర పరిస్థితులు చూడలేదని ప్రజలు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 7,15,298 మంది రైతులు ఉండగా.. వీరిలో 90 శాతం మందికి నష్టాలు వచ్చాయి. అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలను మానసిక వేదనకు గురి చేస్తున్నాయి.
బియ్యం..భయ్యం!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలతో పోలిస్తే.. నేడు విపరీతంగా పెరిగిపోయాయి. వంటనూనెలు, బియ్యం, కందిపప్పు, శనగపప్పు, నిత్యావసర వస్తువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి నెల నుంచే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని, రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ధరలు 25 నుంచి 30 శాతం
2025 డిసెంబరులో పండిన కర్నూలు సోనా బియ్యం కిలో ధర రూ.70 ఉండగా.. పాత బియ్యం కిలో ధర రూ.75 చేరింది. నంద్యాల సోనా బియ్యం కిలో ధర రూ.83 నుంచి రూ.85కు చేరడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. చక్కెర ధర ఒక దశలో 73కు చేరింది. తర్వాత కిలో ధర రూ.50కి తగ్గిపోయింది. పండుగ ముంగిట మళ్లీ పెరుగుదల మొదలైంది. నేడు కిలో ధర రూ.56/58 ప్రకారం అమ్మకాలు సాగుతున్నాయి. కందిపప్పు కిలో ధర రూ.145కి చేరింది. నాణ్యత గల కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. అధిక ధరలు అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. నేడు ధరల పెరుగుదల లేని నిత్యావసర వస్తువు ఒక్కటీ లేదు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. బియ్యం, కందిపప్పు, శనగ పప్పు తదితర వాటిని గోదాముల్లో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు.
కనిపించని సం‘క్షేమం’
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతుభరోసా, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ నేతన్న నేస్తం, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇలా అనేక పథకాలు అమలయ్యాయి. ఒక్కో కుటుంబానికి మూడు, నాలుగు పథకాల కింద ఆర్థిక లబ్ధి చేకూరింది. ఒక్కో కుటుంబానికి సగటున ఏడాదికి రూ.75 వేల నుంచి లక్ష వరకు నగదు ప్రయోజనం లభించింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం రెండు, మూడు సంక్షేమ పథకాలను తూతూ మంత్రంగా అమలు చేస్తోంది. సంక్షేమ పథకాల ఊసే లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజల్లో కొనుగోలు సామర్ధ్యం పడిపోయింది.
బియ్యం.. మరింత ప్రియం
పేదల ఇంట్లో ఉడకని పప్పు
తరగకుండానే
కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి
ధరల నియంత్రణలో
రాష్ట్ర ప్రభుత్వం విఫలం
మాకు 30 ఎకరాల భూములు ఉన్నాయి. రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. లక్ష రూపాయల పంట కూడా లేదు. రసాయన ఎరువుల ధరలు రెక్కింపు అయ్యాయి. బియ్యం, పెట్రోల్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి.
– ఆర్. ప్రమోద్ రెడ్డి, అల్వాల గ్రామం,
గోనెగండ్ల మండలం
మా కుటుంబంలో ముగ్గురం ఉంటాం. నాలుగు నెలల కిత్రం 25 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,300 ఉండింది. ఇప్పుడు రూ.2,200కు పెరిగింది. నిత్యావసరాలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేలకు ఖర్చు పెరిగింది.
– టి.శాంతి, కృష్ణానగర్, కర్నూలు


