కర్నూలు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్పీ దంపతులు విక్రాంత్ పాటిల్, దీపికా పాటిల్ పోలీస్ హెడ్ క్వార్టర్లో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆయుధ పూజలో పాల్గొన్నారు. దుర్గాదేవికి, పోలీసులు వినియోగించే అన్ని రకాల తుపాకులకు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవి చిత్రపటానికి, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ రాఘవేంద్ర, పోలీసు వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి, సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మల్లన్న సేవలో సినీహీరో శ్రీకాంత్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలానికి ఆదివారం సినీ హీరో శ్రీకాంత్ వచ్చారు. నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని సోమవారం మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని వీఐపీ దర్శన సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సినీ హీరో శ్రీకాంత్‌తో పలువురు భక్తులు ఫొటోలు, సెల్ఫీలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మంత్రి టీజీ సమక్షంలో
కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి
కర్నూలు(సెంట్రల్): మంత్రి టీజీ భరత్ సమక్షంలో కర్నూలు 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి మహబూబ్‌ఖాన్ దాడి చేశారు. తాను నామినేషన్ వేసిన వార్డులో మరొకరు ఉండకూడదనే ఉద్దేశంలో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ముస్లింలు అభ్యర్థులు కావడంతో ఓట్లకు దెబ్బ పడుతుందని స్క్రూటీలో కాంగ్రెస్ అభ్యర్థి పత్రాలను టీడీపీ అభ్యర్థి చించి వేశారు. అంతేకాక అతన్ని మంత్రి టీజీ భరత్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడే కాంగ్రెస్ అభ్యర్థిపై మహబూబ్‌ఖాన్ దాడి చేశారు.
కోడ్ ఉల్లంఘన
సంజామల: మండలంలోని ముదిగేడు గ్రామంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేరు బోర్డులను అధికారులు అలాగే వదిలేశారు. వసంతాపురంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వాల్పోస్టులను తీయలేదు. అధికారుల ‘పచ్చ’పాతానికి ప్రజలు మండిపడుతున్నారు. కోడ్ నియమాళిని పకడ్బందీగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
‘ఇది పాలన కాదు..పగే’ పోస్టర్ ఆవిష్కరణ
ఓర్వకల్లు: ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకపాలనపై ‘ఇది పాలన కాదు..పగే’ రోలింగ్ స్టోరీస్ అనే లఘు చిత్రాన్ని తీస్తున్నట్లు ఓర్వకల్లుకు చెందిన పాలకొలను రమేష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో లఘుచిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించినట్లు చెప్పారు. తాను దర్శకత్వం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో శ్యామల పాల్గొన్నట్లు చెప్పారు.


