ఓటరుగా ఉన్నవారే పోటీకి అర్హులు | - | Sakshi
Sakshi News home page

ఓటరుగా ఉన్నవారే పోటీకి అర్హులు

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

● జెడ్పీ సీఈఓ ఆర్‌ సుధాకర్‌రెడ్డి

కర్నూలు(అర్బన్‌): జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఓటరుగా నమోదై ఉండాలని జిల్లా పరిషత్‌ సీఈఓ ఆర్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఖర్చుల లెక్కల నిర్వహణకు అభ్యర్థి స్వీయ ధృవీకరణ దాఖాలు చేయాల్సి ఉంటుందన్నారు. జెడ్పీటీసీకి పోటీ చేసే అభ్యర్థి రూ. 8 లక్షలు, ఎంపీటీసీకి పోటీ చేసే అభ్యర్థి రూ.4 లక్షలు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ల డిపాజిట్‌కు సంబంధించి జెడ్పీటీసీ స్థానానికి ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు రూ.3 వేలు, సాధారణ అభ్యర్థులు రూ.6 వేలు, ఎంపీటీసీ స్థానాలకు ఎస్‌సీ,ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు రూ.1500, సాధారణ అభ్యర్థులు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులు తమ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయాలు, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చన్నారు.

కలెక్టరేట్‌లో ఫిర్యాదుల విభాగం

కర్నూలు(కలెక్టరేట్‌): స్థానిక ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆకస్మికంగా పరిశీలించారు. సోమవారం ఆమె డీఆర్వో సి.వెంకట నారాయణమ్మతో కలసి పరిశీలించి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. వచ్చిన ఫిర్యాదులను వెంటనే నోడల్‌ అధికారులకు పంపాలని, వారి ద్వారా తీసుకున్న నిర్ణయాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

సిద్దిదాయిని.. వరప్రదాయిని

శ్రీశైలంటెంపుల్‌: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దేదీప్యమానంగా దసరా మహోత్సవాలు సాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో సోమవారం సిద్దిదాయిని స్వరూపంలో భ్రమరాంబాదేవి, కై లాస వాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు విహరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా స్వామిఅమ్మవార్లను కై లాస వాహన సేవలో అలంకరించారు. ప్రత్యేక అంకీకృతులైన స్వామిఅమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో ఆశీనులను చేసి ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సిద్దిదాయిని అమ్మవారిని, కై లాస వాహనంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు ఆలయ ఉత్సవం నిర్వహించి గ్రామోత్సవానికి తరలించారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కోలాటలు, తప్పెట్లు, కర్ణాటక డ్రమ్స్‌, మేళాతాళాలు, డప్పు వాయిద్యాలు, కళాకారుల విచిత్ర వేషధారణలు, నృత్యాలతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆయా పూజా కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీశైలంలో నేడు

దసరా మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సహస్ర చండీపారాయణ పూర్వక శతచండీయాగ పూర్ణాహుతి, రుద్రయాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, వసంతోత్సవం, అవభృంథం కార్యక్రమాలు నిర్వహిస్తారు. భ్రమరాంబాదేవి నిజరూప అలంకారంలో, నందివాహనంపై భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. శమీ పూజ, తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement