శాకోత్సవం.. భక్తి పరిమళం | - | Sakshi
Sakshi News home page

శాకోత్సవం.. భక్తి పరిమళం

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

కనుల పండువగా సప్తరాత్రోత్సవాలు

మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు శుక్రవారం కనుల పండువగా సాగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో రాఘవేంద్రుల మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, పుష్పార్చన, పంచామృతాభిషేకంతో విశేష అలంకరణ చేపట్టారు. మూల బృందావనానికి అర్చనలు చేసి హారతులు పట్టారు. వేడుకల్లో భాగంగా రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రుల బృందావన సన్నిధి నుంచి ఉత్సవమూర్తి ఊరేగింపుగా పరిమళ తీర్థ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. పుష్కరిణి మంటపంలో రాయరుకు పీఠాధిపతి విశేష పూజలు చేశారు. అనంతరం అశేష భక్తజన వాహిని మధ్య మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో కోనేరులో ప్రహ్లాదరాయలు విహరించారు. ఈ వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కోనేరు వేదికపై బాగల్‌కోట్‌ విద్వాన్‌ జయతీర్థుల సంగీత కచేరి భక్తులను అలరించింది.

రథాలపై ఊరేగిన ఉత్సవమూర్తి

రాత్రి ఊంజల మంటపంలో రాయరు మూల విరాట్‌కు దివిటీ సేవ, ఉయ్యాల సేవ చేపట్టారు. అక్కడే పీఠాధిపతి శాకోత్సవం(కూరగాయలు, ఫలాలు) పూజలు నిర్వహించారు. కుంకుమ, పుష్పార్చనలు, మంగళ హారతులు పట్టి శాకోత్సవం జరిపారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అంభారి, చెక్క, స్వర్ణ, నవరత్న రథాలపై వైభవంగా ఊరేగించారు. యోగీంద్ర మంటపంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్వాన్‌ నిరంజన హెగ్డే, రవీంద్ర కోటాటి (బెంగళూరు) హార్మోనియం, వేణునాద ప్రదర్శన వీనుల విందు చేసింది. విదూషి శారద సుబ్రమణియన్‌ కర్ణాటక సంగీత కచేరి, ప్రభాత ఆర్ట్స్‌ (బెంగళూరు) నృత్య ప్రదర్శనలు ఆలరించాయి. వేడుకలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు శ్రీనివాసరావు, వెంకటేష్‌జోషి, శ్రీపతి ఆచార్‌, పీఆర్వో నరిసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ పాల్గొన్నారు.

నేడు పూర్వారాధన

వేడుకల్లో భాగంగా శనివారం పూర్వారాధన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను శ్రీమఠంలో సింహవాహనంపై ఊరేగిస్తారు. ఉదయం రాఘవేంద్రుల బృందావనానికి విశేష పూజలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement