నేపాల్‌లో ఆదోని వాసులు సురక్షితం | - | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో ఆదోని వాసులు సురక్షితం

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

కర్నూలు(సెంట్రల్‌): నేపాల్‌లోని టిబెట్‌ దార్బెన్‌ ప్రాంతంలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో చిక్కుకున్న ఆదోని వాసులు సురక్షితంగా హోటల్‌లో ఉన్నట్లు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ..జిల్లా నుంచి ఆదోని చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి భాస్కర శా స్త్రి, కోఆపరేటివ్‌ బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగి శారద, ఆయన కుమారుడు రంగనాథ్‌, కోడలు హన్సిక నేపాల్‌కు వెళ్లారన్నారు. వీరు ఆగస్టు 18న మా నస సరోవర్‌(టిబెట్‌)కు వెళ్లారని, వీరు సెప్టెంబర్‌ 1న రిటర్న్‌ ఫ్లైట్‌ బుక్కు చేసుకున్నారని, ఆ రోజున తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు. వారి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి వారు తప్ప ఇతరులు నెపాల్‌ వెళ్లినట్లు ఎవరూ రిపోర్టు చేయలేదని ఆమె వివరించారు.

బైక్‌ కొనివ్వలేదని...

పాణ్యం: తల్లిదండ్రులు తనకు బైక్‌ కొనివ్వలేదని వడ్డుగండ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాంభూపాల్‌, భారతి దంపతుల కుమారుడు నల్లబోతుల భాస్కర్‌ (20) వారం రోజుల నుంచి బైక్‌ కొనివ్వాలని తన కుటుంబీకులను అడుగుతున్నాడు. వారు బైక్‌ కొనివ్వలేదని మనస్తాపం చెంది గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన శాంతిరామ్‌ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

అదుపు తప్పిన మద్యం లారీ

మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల ఘాట్‌రోడ్డులో మద్యం లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పింది. గిద్దలూరు వైపు వెళ్తుండగా పచ్చర్ల దాటిన తర్వాత గురువారం తెల్లవారుఝామున ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. ప్రమాదవశాత్తు లారీ లోయలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. ప్రమాద ఘటన శిరివెళ్ల పరిధిలోకి రావడంతో శిరివెళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు.

వ్యక్తి ఆత్మహత్య

పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలో విజయానికేతన్‌ పాఠశాల ఎదురుగా ఓ ప్రయివేట్‌ వెంచర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి గురువారం తెలిపారు. తమ్మరాజుపల్లె గ్రామానికి చెంది మిద్దె బాలన్న(51) ఇంటికి మరమ్మతులు చేసేందుకు సిద్ధమవుతుండగా కుటుంబీకుల నుంచి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఈనెల 25వ తేదీన ఇంటి నుంచి బయటికి వచ్చి తిరిగి వెళ్లలేదు. కుటుంబీకులు అంతటా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. గురువారం పాణ్యంలోని ఓ ప్రయివేట్‌ వెంచర్‌లో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి వెళ్లి బాలన్నగా గుర్తించారు. మృతదేహం పక్కన విషపు గుళికలు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య బజారమ్మ, కొడుకు, కుమార్తె ఉన్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో

ఇద్దరికి జైలు

బేతంచెర్ల: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు నిందితులకు డోన్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జైలు శిక్ష విధించారు. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు. డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబడిన బేతంచెర్లలోని కోటపేట కాలనీకి చెందిన సూర్యపోగుల భాస్కర్‌కు మూడు రోజులు, తహసీల్‌పేట కాలనీకి చెందిన విష్ణువర్ధన్‌ రెడ్డికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్‌ ఎస్‌.నూరుల్లా తీర్పునిచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని సీఐ అన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వృద్ధురాలి ఆత్మహత్య

బేతంచెర్ల: మండల పరిధిలోని తవిసికొండ గ్రామానికి చెందిన ఉత్తపై నాగమ్మ (76) అనే వృద్ధురాలు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. బీపీ, షుగర్‌, వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా నాగమ్మ బాధపడున్నారు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం పురుగులమందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బేతంచెర్ల తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కుమారుడు మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ పుల్లయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement