● చిత్రకళల్లో రాణిస్తున్న
గ్రామీణ యువకుడు
నంద్యాల(అర్బన్): సుద్ద ముక్క.. మట్టి ముద్ద.. ఇలా ఏదైనా సరే అతని చేతిలో పడితే అందమైన రూపం దాల్చాల్సిందే. చేతిలో కుంచే ఉంటే చాలు అద్భుత చిత్రాలు ఆవిష్కృతమవుతాయి. చిన్నప్పటి నుంచి తనలో ఉన్న కళా నైపుణ్యాన్ని తనే స్వయంగా తీర్చిదిద్దుకుంటూ ఉత్తమ చిత్రకారుడిగా ప్రశంసలు అందుకుంటూ ఆదర్శంగా నిలిస్తున్నారు. నంద్యాల మండలం గుంతనాల గుంతనాల గ్రామానికి చెందిన శ్రీనివాసులు గౌడ్, సుబ్బరత్నమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ముగ్గురు సంతానం కాగా రెండవ సంతానమైన గుణశేఖర్‌గౌడ్ చిన్న తనం నుంచే చాక్‌పీస్, ధర్మాకోల్ తో అద్భుతమైన బొమ్మలు తయారు చేసేవారు. కోడి గుడ్డుపై ప్రపంచపటం, చాక్ పీస్‌పై ఏసు శిలువ, రాధాకృష్ణుడు, పూర్ణకుంభం, ఇలా రకరకాల బొమ్ములు వేసి అబ్బుర పరుస్తూ వచ్చారు. యువక్త వయస్సు వచ్చేసరికి న్యాచురల్ కలర్స్‌తో వెదురుపుల్ల ద్వారా కళంకారి, చీరలు, హస్తకళ వస్తువులు తయారు చేయడం ఆరంభించారు. కళలు తన ఒకరికే సొంతం కాకుండా పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హస్తకళల గురించి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో భారతదేశ సంప్రదాయాలు, కళలను ఇతర దేశాలకు వివరించే క్రమంలో భాగంగా గత ఏడాది ఢిల్లీలో జరిగిన భారత్ టెక్స్‌లో కళంకారి బొమ్మల ప్రదర్శన పెట్టి అందరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా నిర్వాహకుల చేత మెమొంటో అందుకున్నారు. కేరళ రాష్ట్రంలో జరిగిన కళంకారి ఎగ్జిబిషన్‌లో పాల్గొని సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఇటీవల గుంటూరులోని అమరావతిలో జరిగిన రాష్ట్రస్థాయి హస్తకళల పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన లేపాక్షి హస్తకళ అవార్డు సాధించి ఆదర్శంగా నిలిచారు.


