కర్నూలు: అంతర్రాష్ట్ర దొంగలను కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌లు అరెస్టు చేశారు. వారి వద్ద 15 తులాల బంగారు, 18 తులాల వెండి ఆభరణాలు రికవరీ చేసి జైలుకు పంపారు. ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్‌లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఇంట్లో, అలాగే రిటైర్డ్ ఆర్‌ఎస్‌ఐ సుబ్బయ్య నివాసగృహంలో చోరీ జరిగింది. కర్నూలులోని శ్రీనివాస నగర్‌లోని తమ ఇళ్లలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.2 లక్షల నగదు చోరీ జరిగిందని ఈనెల 23వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ సుబ్బరాయుడు, మురళి, శ్రీనివాసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీ, ఇతర సమాచారం మేరకు దొంగతనానికి పాల్పడిన హైదరాబాదు నగరానికి చెందిన సర్ఫరాజ్, ఖుర్రం అలీ, షానవాజ్‌లుగా గుర్తించారు. వారి ఫోన్ డేటా సేకరించి నిఘా పెట్టారు. గురువారం ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్నట్లు గుర్తించి వలపన్ని పట్టుకుని విచారించగా సర్ఫరాజ్, షానవాజ్, ఖుర్రం అలీ ముగ్గురూ కలసి 23వ తేదీ ప్రత్యేక వాహనంలో నగర శివారులోని ఇళ్ల తాళాలు పగులగొట్టి, బీరువాను బద్దలుకొట్టి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు అంగీకరించారు. వాటిని అమ్ముకునేందుకు బెంగళూరుకుె వెళ్తుండగా పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన క్వాలిస్ వాహనాన్ని సీజ్ చేశారు. వీరిపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్ధిపేట, అడ్డాకుల, రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్లలో పదికి పైగా చోరీ కేసులు ఉన్నట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.


