కర్నూలు సిటీ: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ పీటీడీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు డిపో–1 ఎదుట ధర్నా చేపట్టారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పి.నారాయణ, రీజినల్ ప్రెసిడెంట్ జోసెఫ్, రీజినల్ సెక్రటరీ వై.పోలయ్య పాల్గొని ప్రసంగించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యూటీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
దంత వైద్యులు సత్యనారాయణ మృతి
కర్నూలు (హాస్పిటల్): ప్రముఖ దంత వైద్యులు సత్యనారాయణ రెడ్డి గురువారం తుది శ్వాస విడిచారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన ఆయన గత 20 రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. డాక్టర్ సత్యనారాయణ రెడ్డి కర్నూలు ఎన్‌ఆర్ పేటలోని ‘అవధూత రామిరెడ్డి తాత డెంటల్ క్లినిక్’ వేదికగా ఎంతో మంది పేదలకు ఉచితంగా దంత వైద్య సేవలు అందించారు.
సాగర్‌కు నీటి తరలింపు ఆపాలి
కర్నూలు సిటీ: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు నీటి తరలింపును తక్షణమే నిలిపి వేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్ఞా దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు సీఈ ఎస్.కబీర్ బాషాను కలిసి విన్నవించారు. రాయలసీమలో నీటి సమస్యలతో పాటు, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రాయలసీమ నీటి భద్రతకు చర్యలు చేపట్టాలని సీఈని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నీటి నిర్వహణ కారణంగా రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో తాగు నీరు, ఆరుతడి పంటలకు నీటి భద్రత అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు, అదే విధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా తరలింపును తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మహేశ్వరరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.


