హొళగుంద: హొస్పేట్‌లోని తుంగభద్ర జలాశయం నుంచి శనివారం రాత్రి టీబీ బోర్డు అధికారులు ఏపీ కోటా కింద ఎల్లెల్సీకి 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు మూడు రోజుల్లో జిల్లా సరిహద్దులోకి చేరే అవకాశాలున్నాయి. ఈ నీటిని తాగుకు మాత్రమే వినియోగించుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా తుంగభద్ర జలాశయానికి గత కొద్ది రోజులుగా ఇన్‌ఫ్లో తగ్గి ఆదివారానికి 8 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఈ నెల మొదటి వారంలో లక్ష క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో ఇలా తగ్గడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం టీబీ డ్యాం నుంచి ఎల్‌బీఎంసీ, ఆర్‌బీఎంసీ, ఎల్లెల్సీ, ఆర్‌బీసీ తదితర కాలువలకు 8,508 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
టంగుటూరి సేవలు చిరస్మరణీయం
కర్నూలు (టౌన్): స్వాతంత్య్ర ఉద్యమంలో, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవలు చిరస్మరణీయమని ఏఆర్ అడిషనల్ ఎస్పీ క్రిష్ణమోహన్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆంధ్రకేసరి జయంతి వేడుకలు నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు ఎన్నో సవాళ్లను అధిగమించారన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజలకు విశిష్ట సేవలందించారని కొనియాడారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.


