సి.బెళగల్: మట్టి మాఫియా బరితెగించింది. కొండలు, చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతోంది. అక్రమార్కులపై అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మండల కేంద్రమైన సి.బెళగల్‌లోని ముక్కల గట్టు, మల్లప్ప గట్టులో ప్రతి రోజూ ఎర్రమట్టిని తవ్వుతున్నారు. కంబదహాల్ రోడ్డులోని కొండల్లో అత్యధికంగా తవ్వకాలు చేపడుతున్నారు. తవ్విన మట్టిని ఎమ్మిగనూరు మండలానికి తీసుకెళ్లి విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
కొండలను కొల్లగొడుతూ..
పోలకల్ గ్రామం నుంచి మారందొడ్డి గ్రామానికి వెళ్లే దారిలోని బ్రాహ్మణదొడ్డి కొండలో హిటాచితో తవ్వకాలు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున టిప్పర్లతో ఎర్రమట్టిని ఇతర మండలాలకు తరిలిస్తున్నారు. బ్రాహ్మణదొడ్డి శివారులోని గురుతిప్ప (చిన్న కొండ) నుంచి కూడా పొరుగు మండలమైన గూడూరు మండలానికి ఎర్రమట్టి తరలిపోతోంది. క్రిష్ణదొడ్డి కొండ, మిన్నెల గట్టు, సంగాల, చింతమానుపల్లె, పోలకల్ గ్రామాల్లోని ఏణ (చిన్న గట్టు)లపై సైతం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
నిషేధాలు ఉన్నా బేఖాతర్
పచ్చిక బయళ్లలో అక్రమంగా పంటల సాగుతో పాటు ఎర్రమట్టి తవ్వకాలను హైకోర్టు నిషేధించింది. కొండల్లో విస్తరించి పచ్చిక బయళ్ల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సైతం అధికార యంత్రాంగం కాలరాస్తూ మట్టి మాఫియాను ప్రోత్సహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులతో మాఫియా సభ్యులకు లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ అధికారులు కూడా మట్టి అక్రమాలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.
చెరువుల్లో తవ్వకాలు
రాత్రి వేళలో ఎర్రమట్టి తవ్వకాలు ఎక్కువగా జరుతున్నాయి. సెలవురోజుల్లో శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎర్రమట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. గతంలో సి.బెళగల్ చెరువులో, ఈ మధ్య కాలంలో పలుకుదొడ్డి చెరువులో తవ్వకాలు చేపట్టారు. గత వారం బ్రాహ్మణదొడ్డి చెరువులో మట్టిని రైతుల చాటున అక్రమంగా తరలించుకుని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు.
ఎర్రమట్టి తవ్వకాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మా సిబ్బందితో తవ్వకాలు జరగకుండా నిలుపుదల చేస్తున్నాం. ఇప్పటికే ఎర్రమట్టి త్వవకాల నిలుపుదలకు పోలీస్‌లకు ఆదేశాలు ఇచ్చాం.
– వెంకటలక్ష్మి, సి.బెళగల్ తహసీల్దార్
తరిగిపోతున్న కొండలు,
సహజ వనరులు
ఫిర్యాదులను పట్టించుకోని
అధికారులు
ఆందోళనలో ప్రజలు


