● ప్రత్యేక క్యాంపులకు ఓటర్ల నుంచి
విశేష స్పందన
కర్నూలు(సెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ జూలై 14 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపులకు ఓటర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లాలోని 2,203 పోలింగ్ బూతుల పరిధిలో బీఎల్‌ఓలు ప్రత్యే క్యాంపులు నిర్వహించి ఉదయం 8 నుంచే సాయంత్రం 5 వరకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, స్వీకరించారు. ఆదివారం మధ్యాహ్నానికి 95.07 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా, సర్ ఇంటింటి సర్వేలో భాగంగా సోమ, మంగళవారాలే ఆఖరు రోజులు. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొని ఓటర్లు వెంటనే సంబంధిత బీఎల్‌ఓలు, సమీపంలోని సచివాలయానికి వెళ్లి తీసుకోవాల్సి ఉంది. లేదంటే ఓటును ఎందుకు తొలగించకూడదో అన్న సందేహంతో ఎన్నికల సంఘం ఇచ్చే షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే ఓటును జాబితా నుంచి తొలగిస్తారు. కాగా.. ఓటును తొలగించినా మళ్లీ ఆగస్టు నుంచి దరఖాస్తు చేయడానికి ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో సర్ 2002 జాబితాలో పేరు లేకపోయినా మళ్లీ ఓటు హక్కును పొందడానికి అవకాశం ఉంటుంది.


