రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్‌కు దారాదత్తం చేయడానికి సిద్ధమైంది. సులభరీతిలో రిజిస్ట్రేషన్ సేవల పేరిట పోలవరం, అల్లూరి జిల్లాలు మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే) ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వీటిలో ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్ సేవలు అందించనున్నారు. మొదటి దశలో జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆర్‌ఎస్‌కేల పరిధిలోకి తీసుకొస్తారు. ఆ తరువాత మునిసిపాలిటీలు, నగర, మేజర్ పంచాయతీల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలను ప్రైవేట్‌కు అప్పగించేందుకు ఆర్‌ఎస్‌కేలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ సేవలు ఇకపై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో చేపడతారు. ఈ విధానంతో సేవలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం చెబుతుండగా.. తమ ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని దస్తావేజు లేఖర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్న ప్రజలకు ఈ విధానం అదనపు భారం కానుంది. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రతి దస్తావేజుకు ఇప్పటికే రూ.500 చొప్పున ఎమినిటీస్ ఫండ్ పేరిట వసూలు చేస్తున్నారు.
ఆర్‌ఎస్‌కేల పనితీరు ఇలా..
● పాస్‌పోర్టు సేవా కేంద్రాల తరహాలో సింగిల్ విండో విధానంలో పౌరులకు సేవలు అందించనున్నారు.
● దస్తావేజుల తయారీ, డేటా ఎంట్రీ, అడ్వాన్స్‌డ్ స్లాట్ బుకింగ్, స్టాంపు డ్యూటీ చెల్లింపులు, పత్రాల పరిశీలన తదితర సేవలను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయి.
● తుది రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆమోదం మాత్రం సబ్ రిజిస్ట్రార్ చేతుల్లోనే ఉంటుంది.
● ప్రతి దస్తావేజుపై రూ.2 వేల వరకు సేవా రుసుం వసూలు చేయనున్నారు.
ఆస్తి వివాదాలకు ఆస్కారం
దస్తావేజు రాయడం అనేది కేవలం కంప్యూటర్‌లో డేటా నమోదు చేయడం మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. స్థానక చరిత్ర, పాత లింక్ దస్తావేజులు, సరిహద్దులు, హక్కులు వివరాలపై అవగాహన ఉన్న దస్తావేజు లేఖర్లు ఇప్పటి వరకు వివాదాలకు తావులేకుండా పత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈ బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే భవిష్యత్‌లో ఆస్తి వివాదాలు పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆర్‌ఎస్‌కేల్లో తెల్లకాగితాలపైనే
రిజిస్ట్రేషన్ సేవలు
ప్రస్తుతం రిజిస్ట్రేషన్ సేవలకు స్టాంపులు వా డుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ స్టాంపులను ప్రవేశపెడితే ఎల్లో మీడియా నానా యాగీ చేసింది. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు డిజిటల్ స్టాంపుల స్థానంలో నాసిక్‌లో తయారయ్యే స్టాంపులనే అందుబాటులోకి తెస్తానని నమ్మబలికారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా డిజిటల్ స్టాంపులే నేటికీ దిక్కయ్యాయి. కా గా, గత ప్రభుత్వ హయాంలో అమలు చేయని తెల్లకాగితాలపై రిజిస్ట్రేషన్ సేవల విధానాన్ని ఎల్లో మీడి యా, చంద్రబాబు తెగ ప్రచారం చేసి ప్రజల్లో విషాన్ని నింపారు. ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు కాబోయే ఆర్‌ఎస్‌కేల్లో తెల్లకాగితాలపైనే రిజిస్ట్రేషన్ సేవలు అందేలా సంస్కరణల పేరుతో స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుండటం గమనార్హం.
తెల్ల కాగితాలపైనే
సేవలు అందించే అవకాశం
గత ప్రభుత్వ హయాంలో
అమలు చేయకపోయినా గగ్గోలు
ఇప్పుడు తిరిగి
అదే విధానం వైపు మొగ్గు
ఉపాధి కోల్పోతామంటున్న
దస్తావేజు లేఖరులు
మా పొట్ట కొట్టొద్దు.. బాబూ!
ఇప్పటి వరకు దస్తావేజుల తయారీ, స్లాట్ బుకింగ్, స్టాంపు డ్యూటీ చెల్లింపు, ఆన్‌లైన్ డేటా అప్‌లోడ్ వంటి సేవలను దస్తావేజు లేఖర్లు నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే ఆర్‌ఎస్‌కేల్లో ఆ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుండడంతో తాము జీవనోపాధి కోల్పోతామని దస్తావేజుల లేఖర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


