● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి
కర్నూలు: గడిచిన పక్షం రోజులు న్యాయవాదులు, పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో ప్రీ లోక్ అదాలత్ క్యాంపులు నిర్వహించి విజయవంతం చేసి అధిక కేసులు పరిష్కార దిశగా సహకరించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. శనివారం ఉదయం జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయా కోర్టులలో 31 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేసి కేసుల పరిష్కారానికి ఏర్పాట్లు చేశామన్నారు. బ్యాంకులు, బీమా సంస్థలు ముందుకొచ్చి కేసుల పరిష్కారానికి తోడ్పాటునందించాయన్నారు. శ్రీశైలం ముంపు రైతులకు పెండింగ్ కేసుల్లో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముంపు రైతులకు రూ.2.50 కోట్ల విలువైన చెక్కులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి పి.వాసు, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, మహిళా కోర్టు జడ్జి లక్ష్మీరాజ్యం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీఎల్‌వీ శేషాద్రి, జూనియర్ సివిల్ జడ్జిలు సరోజనమ్మ, అనిల్, అనూష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
పరిష్కారమైన కేసులు ఇలా..
కర్నూలు : 16570
ఆదోని : 14891
ఆళ్లగడ్డ : 3479
ఆలూరు : 6005
ఆత్మకూరు : 727
బనగానపల్లె : 849
డోన్ : 6429
కోవెలకుంట్ల : 702
నందికొట్కూరు : 916
నంద్యాల : 1352
పత్తికొండ : 6403
ఎమ్మిగనూరు : 4228
62,225 కేసులు పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 62,225(సివిల్ 548, క్రిమినల్ 61,551, బ్యాంకు 289) కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి తెలిపారు.
200 మోటార్ యాక్సిడెంట్ కేసులలో రూ.15,11,43,507 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించారు.
అలాగే శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 96 మంది రైతుల వారసులకు రూ.42 లక్షలు నష్టపరిహారం కింద ఇప్పించారు.


