● 6.5 తులాల బంగారు
గొలుసులు స్వాధీనం
కర్నూలు: కర్నూలు కొత్తబస్టాండ్ (ఆర్టీసీ బస్టాండ్)లో ఇద్దరు మహిళల మెడలో గొలుసు చోరీలకు పాల్పడిన తమిళనాడు మహిళా దొంగలను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. గిద్దలూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వరమ్మ కర్నూలు ఎ.క్యాంప్‌లో నివాసముంటున్న తన కుమారుడు వెంకటేశ్వర్లును చూసేందుకు కర్నూలుకు వచ్చి తిరిగి గిద్దలూరు వెళ్లేందుకు గత నెల 11న బస్టాండ్‌లో బస్సు కోసం వేచిఉండగా ఆమె మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని మహిళలు అపహరించారు. అలాగే పెద్దపాడుకు చెందిన బ్యాంకు మహిళా ఉద్యోగి కూడా అదే రోజు విధులకు వెళ్లేందుకు బస్సు కోసం బస్టాండ్‌లో వేచి ఉండగా ఆమె మెడలోని బంగారు గొలుసును కూడా చోరీ చేశారు. బాధితులిరువురూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా బస్టాండ్ పరిసరాల్లో సీసీ ఫుటేజీని పరిశీలించగా తమిళనాడు రాష్ట్రం జోలార్పేటకు చెందిన భాగ్య, హన్నమ్మలుగా గుర్తించారు. బెంగళూరు శివారులోని కుప్పం ప్రాంతంలో వారు సంచరిస్తున్నట్లు గుర్తించి సీఐ విక్రమ సింహ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శరత్ కుమార్, క్రైం పార్టీ సిబ్బంది సుబ్బరాయుడు, మురళి ప్రత్యేక బృందంగా కుప్పం వెళ్లి ప్యాలెస్ రోడ్డులో ఇద్దరు మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 6.5 తులాల రెండు గోల్డ్ చైన్‌లను స్వాధీనం చేసుకుని మహిళా దొంగలను జడ్జి ఎదుట హాజరుపర్చగా రి మాండ్‌కు ఆదేశించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.


