ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామి వారమైన శనివారం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావణ క్షేత్రం తెల్లవారు జామునుంచే భక్తులతో కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో ఉత్సవ మూర్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరద స్వాములను కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదేమి ‘సర్’!
డోన్ రూరల్: అత్యంత పారదర్శకంగా చేపట్టాల్సిన ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అధికారులతో కలిసి టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం దేవరబండ సచివాలయంలో శనివారం జరిగిన సంఘటనే ఉదాహరణ. గ్రామంలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి సర్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బూత్ లెవల్ అధికారి (బీఎల్‌ఓ) తన బాధ్యతను విస్మరించారు. టీడీపీ నాయకులు ఈడిగ రాము గౌడ్, తుపాకుల లక్ష్మీ నారాయణ రెడ్డి, గ్రామ తలారీతో కలసి బీఎల్‌ఓ ఓటర్ల వివరాలను ఐటీడీపీ యాప్‌లో అప్‌లోడ్ చేసేందుకు సహరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదంతా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.
మల్లన్న దర్శనానికి
పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం పరమేశ్వరుడు దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండి పోయాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి.
మద్దిలేటయ్య క్షేత్రం కిటకిట
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీమద్దిలేటి నరసింహ స్వామి క్షేత్రం జ్యేష్ట మాసం శనివారం సందర్భంగా భక్త జన సంద్రమైంది. రెండవ శనివారం సెలవు దినం కావడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. భక్తులకు ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో మెరుగైన ఏర్పాట్లు చేశారు.


