కొత్తపల్లి/దొర్నిపాడు: ఖరీఫ్ సీజన్ మొదలై 40 రోజులు గడిచినా వాన జాడ కనిపించడం లేదు. అక్కడక్కడా సాగు చేసిన పంటలు ఎండకు వాడుపడుతున్నాయి. జూన్‌లో కురిసిన అరకొర వర్షాలకు మొక్కజొన్న, పత్తి, మిరప, ఇతర పంటలు వేశారు. అయితే జూన్ నెల పూర్తయి జూలై కూడా సగం కాలం గడిచింది. వరుణుడు మాత్రం రైతన్నలపై కాస్త కూడా దయచూపడం లేదు. చుక్క వర్షం కూడా కురవకపోవడంతో కొత్తపల్లి మండలంలో మొక్కజొన్న రైతుల్లో ఆందోళన నెలకొంది. వాడుతున్న పంటను కాపాడుకునేందుకు రైతన్నలు పాట్లు పడుతున్నారు. కొంత మంది రైతులు బావులు, బోర్లనుంచి పైపులతో పంటలను తడుపుతున్నారు. మరికొంత మంది స్పింకర్ల ద్వారా పంట పొలాలను తడుపుతూ కాపాడుకొనే ప్రయత్నంలో నానా తిప్పలు పడుతున్నారు. మరోవైపు అన్నదాతలు ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అన్న ఆశతో ఎదురుచుస్తున్నారు. అలాగే దొర్నిపాడు మండలంలో మినుము సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్ల ముందు పంట ఎండుతుండటంతో ఎలా కాపాడుకోవాలో తెలియక ఆకాశం వైపు చూస్తున్నారు.


