హొళగుంద: కర్ణాటక రాష్ట్రం గదగ్‌లోని పుట్టరాజుస్వామి గవాయి మఠానికి హొళగుంద వాసులు బియ్యాన్ని విరాళంగా ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల నుంచి సేకరించిన 250 క్వింటాళ్ల బియ్యంతో పాటు బ్యాళ్లు, ఇతర సరుకులను శనివారం స్థానిక యువకులు, పెద్దలు కర్ణాటకలోని మఠానికి అందజేశారు. రవాణా ఖర్చులకు వ్యాపారవేత్త ఈడిగ గోవింద్ గౌడ్ రూ. 16 వేలు అందజేశారు. మఠంలో చదివే అంధ విద్యార్థులతో పాటు అనాథలు, భక్తుల కోసం ఏటా ఇక్కడి నుంచి నిత్యావసర సరుకులు సేకరించి పంపిస్తున్నారు.
23 మంది హెచ్‌సీలకు పదోన్నతి
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 23 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 16 మంది, నంద్యాల జిల్లాలో ఏడుగురు పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. అయితే వీరందరినీ నంద్యాల జిల్లాకు నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారు అక్కడ రిపోర్ట్ చేసుకోగానే నంద్యాల జిల్లా ఎస్పీ వారిని స్టేషన్లకు కేటాయించనున్నారు.
వాహనాలు ఢీ
● ముగ్గురికి గాయాలు
ఓర్వకల్లు: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై హెచ్ కొట్టాల వద్ద శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వి వరాల మేరకు.. మండలంలోని హెచ్ కొట్టాల వద్ద జాతీయ రహదారి మరమ్మతు పనులు జరుగుతుండటంతో ఒక వైపున వాహనాల రాకపోకలకు దారి మళ్లించారు. కర్నూలు నుంచి నంద్యాల వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం, దాని వెనకాల వస్తున్న ఐచర్ వాహనాలను, ఎదురుగా నంద్యాల వైపు నుంచి టమాట లోడుతో వస్తున్న టస్కర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఆళ్లగడ్డ మండలం ఓలెంపల్లెకు చెందిన శేషు, చాంద్‌బాషా, ఐచర్ వాహనంలోని హరీష్‌చంద్ గాయపడ్డారు. వాహనాలు దెబ్బతిన్నాయి. దాదాపు అర గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. విషయం తెలుసుకున్న గస్తీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా వున్న వాహనాలను పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ వాహనంలో కర్నూ లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డివైడర్‌ను ఢీకొని..
గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన బోయ ఎల్లనాయుడు కర్నూలు నుంచి తన బుల్లెట్ వాహనంపై మద్దలేటయ్యస్వామి ని దర్శించుకునేందుకు బయలు దేరాడు. మార్గమధ్యంలో హెచ్ కొట్టాల బస్సుస్టేజీ వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్‌ను ఢీకొని కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో గాయపడిన అతడిని పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


