మరణంలోనూ జీవించారు! | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ జీవించారు!

Jul 5 2026 2:18 AM | Updated on Jul 5 2026 2:18 AM

● శరీర దానం చేసిన రిటైర్డ్‌ పోస్టుమాస్టర్‌

● శరీర దానం చేసిన రిటైర్డ్‌ పోస్టుమాస్టర్‌

కర్నూలు(హాస్పిటల్‌): ఆయన జీవించి ఉండగా పోస్టుమాస్టర్‌గా పనిచేస్తు నే ఎంతో మందికి విద్య, ఉపాధి విషయాల్లో తోడ్పాటునందించారు. తన మరణానంతరం తనదేహం మట్టిలో కలసిపోకుండా వైద్యవిద్యార్థులకు ఉపయోగపడాలని భావించి కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో ఆయన మరణానంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు మెడికల్‌ కాలేజీకి ఇచ్చా రు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో రైతు కుటుంబంలో ఆరుగురు అన్నదమ్ముల్లో ఐదో వాడిగా 1946 మార్చి ఒకటిన లక్ష్మీపురం బాలయ్య జన్మించారు. చిన్నతనం నుంచి కష్టపడి చదువుకుని పోస్టుమాస్టర్‌గా బేతంచర్ల, డోన్‌, సంజామలలో సేవలందించారు. ఎస్‌ఆర్‌ శంకరన్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీవిత ఆచరణ ప్రేరణ తో విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల పిల్లల విద్యకు, తన పరిధిలో ఇతరులకు విద్య, ఉపాధికి తోడున్నాడు. తన మరణానంతరం భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు వినియోగించేలా వైద్యవిద్యాలయాలకు ఇవ్వాలని కోరుకుని కుటుంబసభ్యులను ఆయన ఒప్పించారు. కాగా ఆయన ఈ నెల 3వ తేదీన వయోధిక అనారోగ్యంతో మరణించారు. ఆయన కోరిక మేరకు కుటుంబసభ్యులు బాలయ్య భౌతిక కాయాన్ని జనవిజ్ఞాన వేదిక వారి సహాయంతో కర్నూలు శివారులోని విశ్వభారతి మెడికల్‌ కాలేజీకి దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ఎల్‌.మోహన్‌ మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయం మేరకు ఆయన శరీరాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఆయన శరీరం వైద్యవిద్యార్థుల బోధనకు ఉపయోగపడాలని కోరారు. జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్‌ వి.బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. తన పిల్లల వ్యక్తిత్వంలో బాలయ్య పాత్ర మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. శరీరదాన ఆవశ్యకతను తెలుసుకుని ఆయన మరణానంతరం తన శరీరాన్ని దానం చేయడం గొప్ప విషయమని చెప్పారు. కార్యక్రమంలో బాలయ్య కుటుంబసభ్యులు డాక్టర్‌ రమేష్‌నాథ్‌, డాక్టర్‌ ఎల్‌.ఆనంద్‌కుమార్‌, జనవిజ్ఞాన వేదిక నాయకులు బర్మా సురేష్‌, యోహాన్‌, శ్రీరాములు, వీరేష్‌, శంకర్‌రావు, రామలక్ష్మణ్‌, ధనుంజయ్‌, మీన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement