ముగ్గురు మెడికల్ విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు
కర్నూలు(అర్బన్): జిల్లాలో నిరుపేదలైన ముగ్గురు మెడిసిన్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నట్లు ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హెచ్‌డీ ఈరన్న తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో అనంతపురం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గోనెగండ్ల మండలం అలువాల గ్రామానికి చెందిన అద్భుతకుమార్‌కు రూ.40 వేల విలువ చేసే పుస్తకాలను అసోసియేషన్ నేతలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యప్రకాష్ అనే విద్యార్థి ఐదేళ్ల ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం పీజీ చేస్తున్నారని, అలాగే ప్రవీణ్‌బాబు అనంతపురంలోనే మూడవ సంవత్సరం ఎంబీబీఎస్ చేస్తున్నారన్నారు. వీరి మెడికల్ విద్యకు సంబంధించి హాస్టల్, కళాశాల ఫీజులను చెల్లించడంతో పాటు విద్యకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలను కూడా అసోసియేషన్ సమకూరుస్తుందన్నారు. ఒక్కొక్కరి విద్యకు రూ.4 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు, మాల్గోవా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజశేఖర్, ఉపాధ్యక్షులు కిష్టన్న, ఇరిగేషన్ డీఈఈ చెన్నయ్య, పీఆర్ ఏఈ మోహన్‌నాయక్ పాల్గొన్నారు.


