టీడీపీ నేతల తీరు వివాదాస్పదమవుతోంది. డబ్బులు ఇచ్చి పదవు
పీఏసీఎస్‌లపై టీడీపీ నేతల పెత్తనం
‘‘మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు పదవులు వచ్చాయి. రైతులకు పంపిణీ చేసే అన్ని రకాల రుణాలపై కమీషన్‌లు వసూలు చేసి మాకివ్వండి.’’ – పీఏసీఎస్‌ల సీఈఓలకు అధికార పార్టీ నేతల హుకుం
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో అధికార పార్టీ నేతల పెత్తనం అధికమైంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునేందుకు రైతులను కూడా పీడించేందుకు సిద్ధమయ్యారు. చివరకు లోన్ల విషయంలో కూడా మెలిక పెట్టడం, అంతోఇంతో వసూలు చేసి తమకు ఇవ్వాలని ఆదేశిస్తుండటంతో సీఈఓలు తలలు పట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల తాము ఇలా చేయలేమని సీఈఓలు మొండికేస్తుండటంతో అధికార పార్టీ నేతలు వీరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 2024 జూన్‌లో చంద్రబాబు సర్కార్ ఏర్పడినప్పటి నుంచి అధికార పార్టీ నేతలు సంపాదన కోసం ఏ అవకాశాన్నీ వదులుకోని పరిస్థితి. ఈ కోవలోనే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల దృష్టి సహకార సంఘాలు, డీసీసీబీ శాఖల ద్వారా జరిగే రుణాల పంపిణీ పడింది.
5 శాతం కమీషన్ వసూలు చేయండి
ఉమ్మడి జిల్లాలో 99 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. ఒకటి, రెండు మినహా అన్నింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు ముగ్గురు సభ్యులతో నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జీ కమిటీలు ఏర్పాటయ్యాయి, ఇందులో ఒకరు చైర్మన్‌గా.. ఇద్దరు సభ్యులుగా ఉంటారు. కొన్ని నియోజకవర్గాల్లో రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ముడుపులు తీసుకొని పీఏసీఎస్‌లకు పాలక వర్గాల ఏర్పాటుకు అధికార పార్టీ నేతలు రెకమెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ డబ్బును ఎలాగైనా రాబట్టుకునేందుకు నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారు. ఆలూరు నియోజక వర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత తన పరిధిలోని సహకార సంఘాల సీఈఓలను తన వద్దకు పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. సహకార సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేసే అన్ని రకాల రుణాలపై 5 శాతం కమీషన్ వసూలు చేయాలని ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం.. ఖర్చు పెట్టుకున్నాం.. ఇప్పుడు అవకాశం వచ్చింది. మాకు సహకరించాలి అంటూ సీఇవోలతో అన్నట్లు సమాచారం. అయితే కొందరు సీఈఓలు ససేమిరా అనడంతో వారిపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆలూరు నియోజక వర్గంలో నెలకొన్న ఈ పరిస్థితి బయటకు పొక్కడంతో ఆ ప్రాంతంలోని సహకార సంఘాలకు బడ్జెట్ ఇవ్వకుండా పక్కన పెట్టినట్లు సమాచారం. ఇదే పరిస్థితి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
రుణాలకు కమీషన్లు వసూలు
చేయాలని ఆదేశం
దిక్కుతోచని స్థితిలో సీఈఓలు
ఆలూరు నియోజకవర్గంలో
చర్చనీయాంశమైన వ్యవహారం
పలు సహకార సంఘాలకు
బడ్జెట్ నిలిపివేత


