శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3,73,66,587 వచ్చింది. సోమవారం స్థానిక రాజ్యాంగణ భవనంలో శ్రీమఠం హుండీ కానుకలు లెక్కించారు. 20 రోజులకు హుండీల్లో వచ్చిన కానుకలు లెక్కించగా నగదు రూ.3,62,69,247, నాణేల రూపంలో రూ.10,97,340 సమకూరింది. అదేవిధంగా 87 గ్రాముల బంగారం, వెండీ 910 గ్రాములు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్ జోషి, ఏఏఓ మాధవశెట్టి తెలిపారు.
కత్తెర పురుగు విజృంభణ
● బెంబేలెత్తుతున్న జొన్న,
మొక్కజొన్న రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): మొక్కజొన్న, జొన్న పంటలపై కత్తెర పురుగు విజృంభిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రబీలో కత్తెర పురుగు సోకి తినేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో జొన్న 4,017 హెక్టార్లు, మొక్కజొన్న 7,426 హెక్టార్లలో.. నంద్యాల జిల్లాలో రెండు పంటలు 10 వేల హెక్టార్లకుపైగా సాగు చేశారు. అయితే కత్తెర పురుగు నివారణకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేకపోవడంతో రైతులు పెస్టిసైడ్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చిన మందులు వాడుతూ నష్టపోతున్నారు. పురుగు ప్రభావంతో దిగుబడులు పడిపోయే ప్రమాదం ఏర్పడింది.
సెలవులో వెళ్లిన పశుసంవర్ధక శాఖ జేడీ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ హేమంత్‌కుమార్ రెండు నెలల పాటు సెలవులో వెళ్లారు. అనారోగ్య కారణాలతో సెలవులో వెళ్లినట్లు చెబుతున్నా.. ఇతర కారణాలు కూడా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పశుసంవర్ధక శాఖ లక్ష్యాల సాధనలో ఉన్నతాధికారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. నేను ఇన్‌చార్జిగా ఉన్నాను.. ఉన్నతాధికారుల ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నాను.. నాకెందుకు ఈ బాధలు, సెలవులో పోతానంటూ పలు సమావేశాల్లో ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇదిలాఉంటే ఆయన స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలతో ఆదోని డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పీవీ రమణను జేడీగా నియమిస్తూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను సత్వరం పరిస్కరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాల ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
కర్నూలు(టౌన్): నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇన్‌చార్జి కమిషనర్ ఆర్‌జీవీ. క్రిష్ణ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోపు ఈ –కైవెసీ, బయోమెట్రిక్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల వ్యవధిలో సరైన సమాధానం తెలియజేయకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు


