త్వరలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు
ఎమ్మిగనూరుటౌన్: ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ కొత్తగా త్వరలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌తో పాటు డిపోను సోమవారం రాత్రి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న బస్సులనే మరమ్మతులు చేయించి నడుపుతున్నామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ కింద సిబ్బంది నియామకాలు చేపట్టనున్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
పల్లెవెలుగు బస్సులకు ఏసీ
పల్లె వెలుగు బస్సులను ఏసీతో నడపాలన్న ప్రతిపాదన ఉందని ద్వారకా తిరుమలరావు తెలిపారు. కార్గో సర్వీసుతో ఆర్టీసీ ఆదాయం రూ.230 కోట్లకు పెరిగిందన్నారు. సీ్త్రశక్తి పథకంతో ఆర్టీసీ ఎలాంటి ఇబ్బంది లేదని, ఆక్యుపెన్సీ 84 శాతానికి పెరిగిందని చెప్పారు. గుత్తి, రాయదుర్గం, గుడివాడలో బస్టాండ్‌లు నిర్మిస్తున్నామన్నారు. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలకు నిధులు కూడా మంజూరు చేస్తున్నామన్నారు. అనారోగ్యం పాలైన డ్రైవర్లు, కండక్టర్లను ఇతర శాఖల్లో విధులు అప్పగిస్తామన్నారు. ఆర్‌ఎం శ్రీనివాసులు, ఈడీ చంద్రశేఖర్, డీఎం మద్దిలేటినాయుడు, డీఎస్పీ భార్గవి, ఎస్‌ఐలు మధుసుదన్‌రెడ్డి, తిమ్మారెడ్డి, ఎర్రన్న పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎండీ ద్వారకా
తిరుమలరావు


