అదృశ్యమైన వివాహిత మృతి
కౌతాళం: కౌతాళం పోలీస్టేషన్ పరిధిలోని కామవరం గ్రామానికి చెందిన వడ్డే కోటేశ్వరి గురువారం తుంగభద్ర దిగువ కాలువలో శవమై తేలింది. సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. కామవరం గ్రామానికి చెందిన వడ్డే వెంకటరాముడు, ఈరమ్మల దంపతుల కుమారుడు వడ్డే వీరేష్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పులకల్ గ్రామానికి చెందిన వడ్డే మద్దిలేటి కూతురు వడ్డే కోటేశ్వరి (21)తో వివాహమౌంది. ఏమి జరిగిందో తెలియదుకానీ తమ కూతురు కనిపించడం లేదని బుధవారం మద్దిలేటి కౌతాళం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తుండగా గురువారం పెద్దతుంబళం గ్రామం వద్ద తుంగభద్ర కాలువలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు బయటకు తీశారు. మృతి చెందిన మహిళ కోటేశ్వరిగా తండ్రి మద్దిలేటి గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.


