చంద్రబాబూ.. కాగితాల ఎంఓయూలు వద్దు
ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారో చూపించండి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
ఆదోని రూరల్: ‘సీఎం చంద్రబాబూ.. ప్రభుత్వం కాగితాల ఎంఓయూలు కాదు... కాసులు కురిపించే ఎంఓయూలు చేపట్టండి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం ఆదోనిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైజాగ్‌లో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో ఎంఓయూలు, ఉద్యోగాల కల్పనపై ప్రజలకు నమ్మకం కలగడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన ప్రశ్నార్థకంగానే మారుతోందన్నారు. విశాఖ వేదికగా ఆర్భాటంగా సీఐఐ పేరుతో సీఎం చంద్రబాబు ఏమి సాధించారని ప్రశ్నించారు. సీఐఐ పేరుతో ఆర్భాటంగా చేసిన ఎంఈఓయూల వల్ల రాష్ట్రాభివృద్ధికి ఏమి మేలు జరుగుతుందో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలన్నారు. ఈ సమ్మిట్ ద్వారా వరకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని నిలదీశారు. 2014–19 మధ్యలో 1,761 ఎంఓయూలు చేసుకుంటే ఎన్ని ఎంఓయూలలో గ్రౌండ్ అయ్యాయో చంద్రబాబు చెప్పాలన్నారు. ప్రజలను, నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు సీఎం చంద్రబాబు ఇలా ఎంఓయూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేపట్టాలని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.రామచంద్రయ్య, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కేవీపీ ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు జగన్నాథం, సీపీఐ నాయుకలు సుదర్శన్, వీరేష్, కల్లుబావి రాజు తదితరులు పాల్గొన్నారు.


