రోడ్డెక్కని ‘పవన్’ హామీ
కర్నూలు(అర్బన్): సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ ఎనిమిది నెలలైనా నెరవేరని పరిస్థితి నెలకొంది. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 22వ తేదీన జిల్లాలోని ఓర్వకల్ మండలం పూడిచెర్ల గ్రామంలో ఫారంపాండ్స్‌కు భూమి పూజ చేసేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తన నియోజకవర్గంలో రెండు రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరగా నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌కు డిప్యూటీసీఎం సూచించారు. అలాగే ఈ రోడ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. దీంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు కూడా ఆఘమేఘాల మీద ఆయా రోడ్లకు అంచనాలు రూపొందించి పంపించారు. అయితే ...నేటికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు సంబంధించిన పనులు మంజూరు రాకపోవడం గమనార్హం. కాగా, గత నెల 17వ తేదీన జిల్లాకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చిన సందర్భంగా ఈ రోడ్ల మీదుగా ప్రజలను వాహనాల్లో తరలించేందుకు తాత్కాలికంగా మట్టి వేసి చేతులు దులుపుకున్నారు.
పవన్ హామీ ఇచ్చిన రోడ్లు ఏవంటే ...
● ఎన్‌హెచ్ 44 నుంచి లక్ష్మీపురం మీదుగా పెద్దపా డు వరకు ( 8.11 కిలోమీటర్లు ) రూ.4.50 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రతిపాదనలను పీఆర్ ఈఎన్‌సీ కార్యాలయానికి పంపారు.
● ఉప్పలపాడు నుంచి గుట్టపాడు మీదుగా కొంతలపాడు వరకు ( 7 కిలోమీటర్లు ) రూ.5 కో ట్లతో అంచనాలతో ప్రతిపాదనలు పంపించారు.
అధ్వానంగా లక్ష్మీపురం – పెద్దపాడు,
ఉప్పలపాడు– కొంతలపాడు రోడ్లు
పనులకు అనుమతులు మంజూరు
చేస్తున్నట్లు 8 నెలల క్రితం
డిప్యూటీ సీఎం ప్రకటన


